
విజయవాడ:అక్టోబర్ 19:-రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం విజయవాడ బీసెంట్ రోడ్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన వీధి వ్యాపారులు, చిన్నచిన్న దుకాణాల యజమానులు, జనరల్ స్టోర్లు, చెప్పుల షాపులు, బట్టల షాపులను సందర్శించి మాట్లాడారు.జీఎస్టీ తగ్గింపు నేపథ్యంలో వస్తువుల ధరల్లో వచ్చిన మార్పులను వ్యక్తిగతంగా అడిగి తెలుసుకున్నారు. ప్రమిదలు, జ్యూట్ బ్యాగులు విక్రయించే చింతజపూడి దుర్గారావుతో సీఎం మాట్లాడి వ్యాపారం పరిస్థితులు, ఎదురవుతున్న ఇబ్బందులను తెలుసుకున్నారు.

అలాగే వీధి వ్యాపారి యక్కలి బాలకృష్ణ, చెప్పుల షాపు యజమాని చదలవాడ వెంకటకృష్ణారావులతో కూడా సీఎం సంభాషించారు. చెప్పులపై జీఎస్టీ తగ్గింపుతో విక్రయాలపై ఎలాంటి ప్రభావం పడిందో వివరంగా అడిగి తెలుసుకున్నారు.బట్టల షాపులో సేల్స్ గర్ల్‌గా పనిచేస్తున్న గొడవర్తి లక్ష్మీతో సీఎం ముచ్చటించి ఆమె పనితీరు, వేతన పరిస్థితుల గురించి విచారించారు. అనంతరం కిరాణా షాపు నిర్వాహకుడు బొడ్డు శ్రీనివాస్‌తో కూడా చర్చించారు. నిత్యావసర వస్తువుల జీఎస్టీ తగ్గింపు ఎంతవరకు ప్రభావం చూపిందో అడిగి తెలుసుకున్నారు.

పర్యటన సందర్భంగా బీసెంట్ రోడ్‌లో కొనుగోలు కోసం వచ్చిన కొందరు వినియోగదారులతో సీఎం మాట్లాడి, వారితో ఫోటోలు దిగారు. ఈ సందర్భంగా ప్రజలకు ముందస్తుగా దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.







