
విజయవాడ:అక్టోబర్ 19:-విజయవాడ పున్నమి ఘాట్‌లో ఆదివారం సాయంత్రం సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ ఆధ్వర్యంలో జరిగిన దీపావళి వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అనాథ పిల్లలతో కలిసి దీపాలు వెలిగించి, వారితో కాసేపు ఆత్మీయంగా గడిపారు. పిల్లలతో కబుర్లు చెప్పుకుంటూ, వారితో పాటు క్రాకర్ షోను కూడా వీక్షించారు.

తరువాత నిర్వహించిన సభను ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ —
విశాఖపట్నంలో గూగుల్ ఏఐ డాటా సెంటర్ ఏర్పాటును జీర్ణించుకోలేని కొందరు రాజకీయ కక్షతో అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని, అటువంటి మాటలను ప్రజలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. విశాఖలో గూగుల్ సంస్థ 15 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్న ఏఐ డాటా సెంటర్ ద్వారా 12 దేశాలకు సేవలు అందనున్నాయని తెలిపారు. అమెరికా వెలుపల గూగుల్ పెడుతున్న అతి పెద్ద పెట్టుబడి ఇదే కావడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు.

హైదరాబాద్ అభివృద్ధి వల్ల దేశంలో అత్యధిక తలసరి ఆదాయం ఆ నగరానికే దక్కుతోందని గుర్తుచేస్తూ, ఇప్పుడు ఆ దిశగా ఆంధ్రప్రదేశ్‌లో కూడా క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కి చిరునామాగా మార్చడమే లక్ష్యమని పేర్కొన్నారు.

“ఏఐ ద్వారా రాబోయే పదేళ్లలో ఊహించని స్థాయిలో అభివృద్ధి జరగబోతోంది. ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త తయారుకావాలని, ప్రపంచంలోనే తెలివైన ప్రజల రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలవాలని కృషి చేస్తున్నాం” అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
దీపావళి సంబరాల్లో పాల్గొన్న పిల్లలు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రితో ఫోటోలు దిగారు. ఘాట్ పరిసరాలు విద్యుత్ దీపాలతో, పటాకుల కాంతులతో మెరిసిపోయాయి.
 
  
 






