
ఇటీవల హైదరాబాద్ లోని త్యాగరాయ గాన సభలో’ కళా రత్న అవార్డు’ మరియు ఏలూరులో జరిగిన ప్రపంచ తెలుగు సాహితీ సంబరాల్లో ‘కవిరత్న అవార్డు’ , విజయవాడలో జరిగిన తెలుగు వెలుగు సాహితీ జాతీయ వేదిక వారి కార్యక్రమంలో ‘నంది అవార్డు’ అందుకొన్న వినుకొండ పట్టణానికి చెందిన కవి కమలారామ్ ని పట్టణానికి చెందిన వివిధ సంస్థలకు సంబంధించిన ప్రతినిధులు, వారి శ్రేయోభిలాషులు ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సులభమైన తేట తెలుగులో సామాన్యులను సైతం రంజింప చేసే విధంగా రచనలు చేయడం కమలారామ్ కే చెల్లింది అన్నారు. క్లుప్తమైన కవితలతో గంభీరమైన భావాన్ని అందించడం కమలా రామ్ సొంతమని, అనేక కవితలు, సినీ గేయాలు సైతం రచించిన వినుకొండ వ్యక్తిగా, మంచి స్నేహశీలిగా పేరుపొందిన కమలారామ్ వివిధ వేదికలపై సన్మానించ బడటం ఎంతో ఆనందదాయకం అన్నారు. తదుపరి కమలారామ్ ని దుశాలువలు మరియు పూలతోను సత్కరించి అభినందించారు. తన సాహిత్యాన్ని ఆదరించిన పాఠకులకు, వినుకొండ ప్రజలకు మరియు అభినందించిన,సత్కరించిన వారికి కమలారామ్ తన కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో భాగవతుల రవికుమార్, గాలి శ్రీనివాసరావు, మంత్రి రాజు సత్యనారాయణ,గజవల్లి నాగ పవన్ కుమార్, జి.మాధవరావు, చింతలచెరువు రఘు, దేవలపల్లి శేఖర్, భవనాసి సాంబశివరావు,కంచర్ల వీరభద్రాచారి తదితరులు పాల్గొన్నారు.
 
  
 






