
విశాఖపట్నం:12-11-25:- నగరంలో ఐటీ రంగం మరోసారి కదలికలోకి వచ్చింది. పార్టనర్‌షిప్ సమ్మిట్-2025కు ముందే టెక్ కంపెనీల జాతర నెలకొననుంది. రేపు (13వ తేదీ) రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ నాలుగు ఐటీ కంపెనీల భూమిపూజతో పాటు పలు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు

రహేజా గ్రూప్ ఆధ్వర్యంలో ఐటీ స్పేస్, రెసిడెన్షియల్ ప్రాజెక్టుల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న మంత్రి లోకేష్, అలాగే విశాఖలో వరల్డ్ ట్రేడ్ సెంటర్‌కు కూడా శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టులు ప్రారంభమవడంతో వేలాది ఉద్యోగావకాశాలు సృష్టికానున్నాయి.ఇదే సమయంలో టిసిఎస్, కాగ్నిజెంట్ వంటి ప్రముఖ సంస్థలు విశాఖలో తమ డెవలప్‌మెంట్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు దశల వారీగా ముందుకు సాగుతున్నాయి. టిసిఎస్ ద్వారా 12 వేలమంది యువతకు, కాగ్నిజెంట్ ద్వారా మరో 8 వేలమందికి ఉద్యోగాలు లభించనున్నాయి.మంత్రి లోకేష్ సదుపాయాల అభివృద్ధికి తీసుకున్న చొరవతో విశాఖపై జాతీయ, అంతర్జాతీయ ఐటీ సంస్థలు చూపిస్తున్న ఆసక్తి గణనీయంగా పెరిగింది. ఇప్పటికే గూగుల్ సంస్థ ప్రపంచంలోనే అతిపెద్ద ఎఐ హబ్‌ను అమెరికా వెలుపల విశాఖలో రూ.1.35 లక్షల కోట్లతో ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే.పార్టనర్‌షిప్ సమ్మిట్-2025కు ముందు విశాఖలో ఐటీ పెట్టుబడుల ఈ వర్షం… ఆంధ్రప్రదేశ్ టెక్ రంగానికి కొత్త దిశ చూపనుంది.







