
విశాఖపట్టణం, జనవరి 29:-విశాఖ ఉత్సవ్‌లో భాగంగా మంగమారిపేట వద్ద నిర్వహించిన బోట్ రేస్ పోటీలు సందడి వాతావరణంలో సాగాయి. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్‌తో కలిసి జెండా ఊపి పోటీలను ప్రారంభించారు.

సమీప గ్రామాలకు చెందిన మత్స్యకారులు పోటీల్లో పాల్గొని తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఉత్సవ్ షెడ్యూల్‌లో భాగంగా గురువారం మధ్యాహ్నం 2 గంటలకు నాన్ మెకనైజ్డ్ బోట్ల రేస్ చిప్పాడ ఉప్పుగల్లి తీరం నుంచి ప్రారంభమై భీమిలి జోనల్ కార్యాలయం తీరం వరకు సుమారు 2 కిలోమీటర్ల మేర కొనసాగింది. మధ్యాహ్నం 3 గంటల అనంతరం మంగమారిపేట వద్ద మెకనైజ్డ్ బోట్ల రేస్ ప్రారంభమై భీమిలి వరకు సుమారు 6 కిలోమీటర్ల మేర సాగింది.

ప్రతి విభాగంలో 15 బోట్లు పాల్గొనగా, ఒక్కో బోట్లో ముగ్గురేసి చొప్పున మొత్తం 90 మంది మత్స్యకారులు పోటీల్లో భాగస్వామ్యులయ్యారు. పోటీలను వీక్షించేందుకు భీమిలి తీరానికి పెద్ద సంఖ్యలో ప్రజలు, పర్యాటకులు తరలివచ్చారు.
ఈ పోటీలను మత్స్యశాఖ, టూరిజం, క్రీడాశాఖలు సంయుక్తంగా నిర్వహించాయి. కార్యక్రమంలో భీమిలి ఆర్డీవో సంగీత్ మాధుర్, మత్స్యశాఖ జేడీ లక్ష్మణరావు, టూరిజం అధికారిణి మాధవి, క్రీడా అధికారిణి జూన్ గ్యాలియెట్, తహశీల్దార్ రామారావు, జోనల్ కమిషనర్, మత్స్యకార సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

విజేతలు వీరే
మెకనైజ్డ్ బోట్ రేసులో సీరం లక్ష్మణ్ ప్రథమ స్థానంలో నిలవగా, సీరం గణేష్ ద్వితీయ, గిరికిన రాజేష్ తృతీయ స్థానాల్లో నిలిచారు. నాన్ మెకనైజ్డ్ బోట్ రేసులో కాసారపు చిన పైడిరాజు ప్రథమ, కాసారపు ధనరాజ్ ద్వితీయ, కాసారపు పేర్రాజులు తృతీయ స్థానాల్లో నిలిచినట్లు మత్స్యశాఖ అధికారులు తెలిపారు.Visakha Local News :ఆర్కే బీచ్ కేంద్రంగా విశాఖ ఉత్సవాల సందడి
రెండు విభాగాల విజేతలకు ఈ నెల 31వ తేదీన ఆర్కే బీచ్ ప్రధాన వేదిక వద్ద జరిగే విశాఖ ఉత్సవ్ ముగింపు వేడుకల్లో బహుమతులు అందజేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.










