
ఎన్టీఆర్ జిల్లా :విజయవాడ: నవంబర్ 13:-విజయవాడ కమిషనరేట్ పరిధిలోని విస్సన్నపేట పోలీసు అధికారులు అక్రమ కోడి కత్తుల తయారీ కేంద్రాన్ని బట్టబయలు చేశారు. తిరువూరు సర్కిల్ పరిధిలో తిరువూరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కే. గిరిబాబు, విస్సన్నపేట ఎస్‌ఐ జి. రామకృష్ణ, పీఎస్‌ఐ కె. ఉమామహేశ్వరరెడ్డి సిబ్బందితో కలిసి గురువారం సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక దాడులు నిర్వహించారు.ఈ దాడుల్లో నడకుదురు సర్వేశ్వరరావు, జవ్వాజి సురేంద్ర, నడకుదురు చంద్రశేఖర్ అనే ముగ్గురు వ్యక్తులు విస్సన్నపేట గ్రామంలో అక్రమంగా కోడి కత్తులు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. పోలీసులు అక్కడి నుంచి 400 కోడి కత్తులు, తయారీకి ఉపయోగించే మోటార్ యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు.

పోలీస్ కమిషనర్ శ్రీ S.V. రాజశేఖర్ బాబు, IPS గారి ఆదేశాల మేరకు, డీసీపీ బి. లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో, ఏసీపీ వై. ప్రసాదరావు గారి పర్యవేక్షణలో ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.అక్రమ కోడి పందేలలో పాల్గొనడం, కోడి కత్తులు తయారు చేయడం, అమ్మడం లేదా వినియోగించడం చట్ట విరుద్ధమని అధికారులు హెచ్చరించారు. ఇటువంటి అక్రమ కార్యకలాపాల్లో పాల్గొనేవారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారులు స్పష్టం చేశారు.







