
- చీరాలలో ఘనంగా సావిత్రిబాయి పూలే వర్ధంతి
- నివాళులర్పించిన ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య, యువనేత గౌరీ అమర్నాథ్
- తొలితరం మహిళా ఉపాధ్యాయురాలి సేవలు చిరస్మరణీయం
చీరాల: భారతదేశ చరిత్రలో అణచివేతకు వ్యతిరేకంగా, వివక్ష లేని సమాజం కోసం అక్షరాన్నే ఆయుధంగా మలిచిన తొలితరం విప్లవకారిణి, దేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే వర్ధంతి సభ చీరాలలో ఘనంగా జరిగింది. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో చీరాల శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య, యువ నాయకులు శ్రీ మద్దులూరి గౌరీ అమర్నాథ్, మరియు ఇతర కూటమి నాయకులు పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. కేవలం ఒక ఉపాధ్యాయురాలిగా మాత్రమే కాకుండా, మనువాద పితృస్వామ్య భావజాలాన్ని ధిక్కరించిన సామాజిక యోధురాలిగా సావిత్రిబాయి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. సమాజంలోని కుళ్లును కడిగేయడానికి ఆమె చేసిన పోరాటాన్ని గుర్తుచేసుకున్నారు.

సావిత్రిబాయి పూలే స్ఫూర్తిదాయక ప్రస్థానం:
- జననం – విద్యాభ్యాసం: 1831, జనవరి 3న మహారాష్ట్రలోని సతారా జిల్లా, నైగావ్‌లో జన్మించిన సావిత్రిబాయికి 9 ఏళ్ల వయసులోనే జ్యోతిరావు పూలేతో వివాహం జరిగింది. భర్త ప్రోత్సాహంతోనే ఆమె అక్షరాభ్యాసం చేసి జ్ఞానాన్ని సముపార్జించారు.
- తొలి మహిళా ఉపాధ్యాయురాలు: 1848లో పూణేలో మొట్టమొదటి బాలికల పాఠశాలను ప్రారంభించి చరిత్ర సృష్టించారు. అగ్రవర్ణ అహంకారులు ఆమెపై బురద, పేడ, రాళ్లు విసిరినా వెరవకుండా, తన వెంట మరో అదనపు చీరను తీసుకెళ్లి మరీ అణగారిన వర్గాలకు విద్యాబోధన చేశారు.
- సామాజిక సంస్కరణలు: అంటరానితనం పేరిట విద్యకు దూరమైన దళిత, శూద్ర వర్గాల కోసం విద్యా సంస్థలను స్థాపించారు. పురోహితులు లేని వివాహాలను ప్రోత్సహించారు. వితంతువుల తలనీలాల అనాచారానికి వ్యతిరేకంగా మంగలి వారితో సమ్మె చేయించారు. గర్భం దాల్చిన వితంతువుల కోసం ‘బాలహత్యా ప్రతిబంధక గృహం’ స్థాపించారు. కరువు కాలంలో కులమతాలకు అతీతంగా వేలమందికి అన్నదానం చేశారు.
- అక్షర యోధురాలు: “చదువుకోకపోవడం అంటే పశువుగా మిగిలిపోవడమే.. స్త్రీ విద్యే సమాజ ప్రగతికి అసలైన సోపానం” అని చాటిన గొప్ప కవయిత్రి ఆమె. అగ్రవర్ణాల గుత్తాధిపత్యంలో ఉన్న విద్యకు ప్రత్యామ్నాయంగా, ఇంగ్లీష్ విద్యను అభ్యసించి బానిస సంకెళ్లు తెంచుకోవాలని ఆనాడే పిలుపునిచ్చారు.

సేవలోనే తుదిశ్వాస.. 1897లో పూణేలో ప్లేగ్ వ్యాధి ప్రబలినప్పుడు ఆమె ప్రాణాలకు తెగించి రోగులకు సేవ చేశారు. ఒక ప్లేగ్ బాధితుడైన బాలుడిని భుజంపై వేసుకుని ఆసుపత్రికి తీసుకెళ్తున్న క్రమంలో ఆమెకు కూడా ఆ వ్యాధి సోకింది. రోగులకు సేవచేస్తూనే 1897, మార్చి 10న ఈ అక్షర విప్లవ మూర్తి కన్నుమూశారు. మనువాద, పెట్టుబడిదారీ భావజాలాలకు అతీతంగా, మనిషిని మనిషిగా గుర్తించే సోషలిస్టు సమాజం కోసం ప్రజలను చైతన్యవంతం చేయడమే సావిత్రిబాయికి మనం ఇచ్చే నిజమైన నివాళి అని నాయకులు పిలుపునిచ్చారు. అసమానతలపై ఆమె చూపిన బాటలో పోరాడటమే నేటి తక్షణ అవసరమని స్పష్టం చేశారు.bapatla news







