
గుంటూరు: ఓటర్ల జాబితా ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR)లో భాగంగా గుంటూరు తూర్పు (95), పశ్చిమ (94) నియోజకవర్గాల్లో ఎలక్ట్రోల్ మ్యాపింగ్‌ను రానున్న రెండు వారాల్లోగా పూర్తి చేయాలని నగర కమిషనర్ మరియు తూర్పు నియోజకవర్గ ఈఆర్ఓ కె. మయూర్ అశోక్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జీఎంసీ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్‌లో బీఎల్ఓలు, సూపర్వైజరీ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.
మ్యాపింగ్ పురోగతిపై అసహనం
నగరంలోని రెండు నియోజకవర్గాల్లో మ్యాపింగ్ ప్రక్రియ కేవలం 55 శాతం మాత్రమే పూర్తి కావడంపై కమిషనర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఈ ప్రక్రియపై అత్యంత ప్రత్యేక దృష్టి సారించిందని, బీఎల్ఓలు ప్రతి ఇంటికీ వెళ్లి నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం మ్యాపింగ్/ప్రోజేనీ పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ప్రతి బీఎల్ఓ కనీసం 80 శాతం మ్యాపింగ్ లక్ష్యాన్ని చేరుకోవాలని, విధుల్లో నిర్లక్ష్యం వహించే వారిపై ఎన్నికల సంఘం నిబంధనల మేరకు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

క్షేత్రస్థాయి పర్యవేక్షణకు ఆదేశం
సూపర్వైజరీ అధికారులు క్షేత్రస్థాయిలో ఉండి మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని, మ్యాపింగ్ ఖచ్చితత్వాన్ని తాము కూడా ఆకస్మిక తనిఖీలు చేస్తామని కమిషనర్ తెలిపారు. ప్రతిరోజూ బీఎల్ఓల వారీగా ప్రగతి నివేదికలను అందజేయాలని ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. ఈ సమావేశంలో గుంటూరు పశ్చిమ ఈఆర్ఓ మరియు అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు, ఏఈఆర్ఓ సూరజ్ కుమార్, ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ బాలాజీ బాష తదితరులు పాల్గొన్నారు.http://GUNTUR NEWS







