
గుంటూరు: డిసెంబరు 30:-జిల్లాలో నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో అమలవుతున్న ఉల్లాస్ అక్షర ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా సక్రమంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు.

మంగళవారం కలెక్టర్ కార్యాలయం నుంచి మండల ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, సీఎంఎంలు, ఎంపీడీవోలు, ఏపీఎంలు, ఏపీఓలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. Guntur Local newsజిల్లాలో గుర్తించిన నిరక్షరాస్యులకు అక్టోబరు నెల నుంచి ఉల్లాస్ అక్షర ఆంధ్ర ద్వారా శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. మొత్తం వంద గంటల పాటు జరిగే ఈ శిక్షణ కార్యక్రమం మార్చి వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు.
పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. లెసన్ ప్లాన్లు, బోధనా విధానాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. శిక్షణ కాలం ముగిసే నాటికి నిర్దేశిత లక్ష్యాల మేరకు ప్రతి నిరక్షరాస్యుడు ప్రాథమికంగా చదవడం, వ్రాయడం నేర్చుకుని అక్షరాస్యులుగా మారేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా వయోజన విద్య డిప్యూటీ డైరెక్టర్ ఆంజనేయులు మాట్లాడుతూ, పట్టణ ప్రాంతాల్లో సీఎంఎంలు, గ్రామీణ ప్రాంతాల్లో ఏపీఎంలు, ఏపీఓలు ప్రతిరోజూ తరగతుల నిర్వహణ వివరాలను తప్పనిసరిగా నివేదించేలా ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు పర్యవేక్షించాలని సూచించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.







