
గుంటూరు: నవంబర్ 10 :-వర్షపు నీటిని సద్వినియోగం చేసుకుని జీవనోపాధి పెంచాలని కేంద్ర కమ్యూనికేషన్లు, గ్రామీణాభివృద్ధి శాఖ సహాయమంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. వాటర్ షెడ్ మహోత్సవ్‌పై జాతీయ స్థాయి రెండు రోజుల సదస్సు సోమవారం గుంటూరు వెల్కమ్ గ్రాండ్ హోటల్‌లో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి డా. చంద్రశేఖర్ జ్యోతిప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ గుంటూరులో మూడవసారి ఈ సదస్సు నిర్వహించడం గర్వకారణమని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం మంచి పథకాలను అమలు చేస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం ఆ పథకాలను విజన్‌తో ఉపయోగించుకుని దేశంలో ఆదర్శంగా నిలవాలని అన్నారు. అభివృద్ధికి రాష్ట్రం నుండి మరింత భాగస్వామ్యం అవసరమని తెలిపారు.జూలై నుంచి సెప్టెంబర్ వరకు వచ్చే వర్షాలను సద్వినియోగం చేసుకోవాలని, వర్షపు నీటిని ఒడిసి పట్టి జీవనోపాధిని పెంచాలని సూచించారు. ప్రతి వ్యక్తికి సంవత్సరానికి 1700 క్యూబిక్ మీటర్ల నీటి అవసరముందని, దానికంటే తక్కువ నీరు లభిస్తే నీటి కొరతగా పరిగణిస్తారని తెలిపారు. నీటి భద్రతను జాతీయ భద్రతగా పరిగణిస్తున్న ప్రధాని మోదీ దృష్ట్యా వాటర్ షెడ్ పథకాలను అమలు చేస్తున్నామని వివరించారు.

నీటి వనరుల సద్వినియోగం ద్వారా వ్యవసాయ రంగంలో ఆరు రెట్ల ఉత్పాదకత సాధించవచ్చని, రెండు నుంచి మూడు పంటలు వేసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. భూగర్భజలాలు కనీసం మూడు మీటర్ల మేర పెరుగుతాయని వివరించారు. 2021–26 మధ్య రూ.13 వేల కోట్ల వ్యయంతో వాటర్ షెడ్ 2.0 పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు.ప్రతి గ్రామంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని, శాఖల మధ్య సమన్వయం లేకుంటే అమలులో జాప్యాలు వస్తాయని హెచ్చరించారు. ప్రజల్లో అవగాహన లేకపోవడం వల్ల ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు కోల్పోతున్నామని వ్యాఖ్యానించారు.వెంగళాయపాలెంలో అమృత్ సరోవర్ క్రింద 21 ఎకరాల విస్తీర్ణంలో చెరువును అభివృద్ధి చేసి, చుట్టుపక్కల ఉద్యానవనం, వాకింగ్ ట్రాక్, చిన్నారుల కోసం క్రీడా పరికరాలు, యోగా ప్రాంగణం ఏర్పాటు చేశామని వివరించారు.
కేంద్ర భూ సంస్కరణల విభాగం కార్యదర్శి మనోజ్ జోషి మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా నీటి వనరుల అభివృద్ధికి వాటర్ షెడ్ పథకాల ద్వారా నిధులు అందిస్తున్నామని, స్వచ్ఛంద సంస్థలను భాగస్వామ్యంగా తీసుకుంటున్నామని చెప్పారు. కొన్ని రాష్ట్రాలు వేగంగా మంచి పనులు పూర్తి చేస్తున్నాయని ఆయన ప్రశంసించారు.రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎం. శశిభూషణ్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్రంలో నీటి వసతుల పునరుద్ధరణపై దృష్టి సారిస్తున్నామని తెలిపారు.ఈ సందర్భంగా మంత్రి డా. చంద్రశేఖర్ “Ensuring Water Security, Nurturing Wasteland, Empowering Rural Livelihoods – Rajasthan” అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు.కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ జాయింట్ సెక్రటరీ నితిన్ కడే, రాష్ట్ర పంచాయతీరాజ్ సంచాలకుడు మైలవరపు కృష్ణ తేజ, జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కమిషనర్ సి.పి. రెడ్డి, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, వాటర్ షెడ్ విభాగం సంచాలకుడు వై.వి.కె. షణ్ముఖ కుమార్, వివిధ రాష్ట్రాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.







