
ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పరిశోధనలు మరియు క్రీడలను ప్రోత్సహించేందుకు ఏటా రూ. 22.13 కోట్ల ప్రత్యేక నిధులను కేటాయిస్తున్నట్లు వీసీ వెల్లడించారు. ఈ పథకం కింద కేవలం అల్లోపతియే కాకుండా ఆయుష్, డెంటల్, నర్సింగ్, ఫిజియోథెరపీ విద్యార్థులకు కూడా ప్రయోజనం చేకూరనుంది. పరిశోధనల పట్ల ఆసక్తి పెంచేందుకు ప్రతి ఏటా 1,000 మంది విద్యార్థులకు ఆరు నెలల పాటు నెలకు రూ. 5 వేల చొప్పున మొత్తం రూ. 30 వేల ఉపకార వేతనం అందించనున్నట్లు తెలిపారు. అలాగే ఫ్యాకల్టీ రీసెర్చ్ గ్రాంట్‌ను కూడా పెంచుతూ, ప్రస్తుతం ఉన్న 25 మంది పరిమితిని 200 మందికి విస్తరించారు. పరిశోధనా పత్రం ప్రాధాన్యతను బట్టి వీరికి రూ. 2 లక్షల నుండి రూ. 5 లక్షల వరకు ఆర్థిక సహాయం అందనుంది.

సాంకేతికతను అందిపుచ్చుకుంటూ వర్సిటీ కేంద్రంగా ‘ఏఐ బేస్డ్ డిసీజ్ మోడలింగ్ అండ్ డెసిషన్ సెంటర్’ (DMDC)ను ఏర్పాటు చేస్తున్నట్లు డాక్టర్ చంద్రశేఖర్ ప్రకటించారు. గేట్స్ ఫౌండేషన్ మరియు నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ సింగపూర్ సహకారంతో వ్యాధుల ముందస్తు అంచనా, నివారణ చర్యలపై ఈ కేంద్రం పనిచేస్తుందని వివరించారు. విద్యార్థుల మానసికోల్లాసం కోసం ప్రతి ప్రభుత్వ వైద్య కళాశాలకు క్రీడల నిర్వహణ మరియు మైదానాల అభివృద్ధికి ఏటా రూ. 10 లక్షలు కేటాయిస్తున్నట్లు తెలిపారు. వీటితో పాటు పూర్వ విద్యార్థుల అసోసియేషన్లను ఒకే తాటిపైకి తెచ్చేందుకు వర్సిటీ వారధిగా నిలుస్తుందని, అమరావతిలో వర్సిటీ కోసం 25 ఎకరాల స్థల కేటాయింపు ప్రక్రియ చురుగ్గా సాగుతోందని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో రిజిస్ట్రార్ డాక్టర్ టి. సాయిసుధీర్, ఆర్ అండ్ డీ డైరెక్టర్ డాక్టర్ ఎం. లక్ష్మీ సూర్యప్రభ తదితరులు పాల్గొన్నారు.http://NTR DISTRICT NEWS







