సినీ ఇండస్ట్రీలో, మోడలింగ్ లో నల్లగా ఉండేవాళ్లను చులకనగా చూసే సందర్భాలు ఇప్పటికీ కనిపిస్తూనే ఉన్నాయి. రంగు వల్లనే అవకాశాలు రాకపోవడం, కలల కోసం వచ్చిన అమ్మాయిలకు ఎదురయ్యే అవమానాలు చాలా మందిని మానసికంగా కుంగదీస్తున్నాయి. ఇలా వర్ణ వివక్షపై గళమెత్తి, ప్రతిభకు రంగు అడ్డు కాదని నిరూపించిన యువతి శాన్ రేచల్, చివరికి ఆత్మహత్య చేసుకోవడం అందరినీ కలిచివేసింది.
ప్రముఖ మోడల్‌గా గుర్తింపు పొందిన 26 ఏళ్ల శాన్ రేచల్ పుదుచ్చేరిలోని తన ఇంట్లో ట్యాబ్లెట్లు ఎక్కువ మోతాదులో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లినా, ఆమె ప్రాణాలను కాపాడలేకపోయారు. ఆమె మృతి పది రోజుల కిందటే పెళ్లి చేసుకున్న తర్వాత జరిగింది. రంగు కారణంగా సినీ పరిశ్రమలో, మోడలింగ్ లో ఎదురైన వివక్షపై తరచూ సోషల్ మీడియాలో గళమెత్తిన రేచల్, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్లు సమాచారం.
తన తండ్రిని ఆర్థికసహాయం చేయమని అడిగినప్పటికీ, పరిస్థితులు కుదరకపోవడంతో, తను తీసుకున్న అప్పులు, నష్టాల భారం ఆత్మహత్యకు దారితీసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మోడలింగ్ ఈవెంట్లలో నష్టపోయినట్లు, నగలు తాకట్టు పెట్టి కొందరికి డబ్బులు చెల్లించినట్లు రేచల్ కుటుంబం చెబుతోంది.
రేచల్ 2022లో మిస్ పుదుచ్చేరి టైటిల్ గెలుచుకుంది. 2019లో మిస్ డార్క్ క్వీన్ తమిళనాడు, 2022లో క్వీన్ ఆఫ్ మద్రాస్ టైటిళ్లను కూడా గెలుచుకుని, ప్రతిభతో పాటు ఆత్మవిశ్వాసం కూడా కలిగిన యువతిగా ఎదిగింది. నల్లగా ఉండడమే తన తప్పా అని ఒక సందర్భంలో ఆమె ప్రశ్నిస్తూ, రంగు కారణంగా ఎదురైన అవమానాలను బలంగా సోషల్ మీడియాలో పెట్టేది.
తాజాగా ఆమె ఇంట్లో లభించిన సూసైడ్ నోట్ లో తన మరణానికి ఎవరు కారణం కాదని రాసి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కానీ ఒకరు రెండు నిమిషాల అనేక కలల కోసం పోరాడుతున్న యువతి, రంగు కారణంగా, ఆర్థిక సమస్యల కారణంగా, అనారోగ్య సమస్యల కారణంగా చివరికి ఆత్మహత్యకు పాల్పడడం ఆత్మవిశ్వాసం కలిగిన ప్రతి యువతిని కలిచివేస్తోంది.
సినీ పరిశ్రమ, మోడలింగ్ రంగంలో ఇంకా వర్ణ వివక్ష కొనసాగుతూనే ఉందా? ప్రతిభ ఉన్నప్పటికీ, రంగు కారణంగా అవకాశాలు కరువైపోవడం ఎంతవరకు సరి? అంటూ ఈ ఘటన మరింత చర్చకు తావిస్తుంది.