ప్రజా ప్రతినిధులు జోక్యం చేసుకోవాలని డిమాండ్
కృష్ణా జిల్లా, పెడన నియోజకవర్గం:
కృత్తివెన్ను మండల కేంద్రం సీతనపల్లి గ్రామపంచాయతీలో ఏర్పాటు చేయబోతున్న వైన్ షాప్‌కు మహిళలు, గ్రామస్థులు గట్టి వ్యతిరేకత తెలిపారు.
స్థానిక మహిళలు శనివారం గ్రామంలో గుమికూడి “మా గ్రామంలో వైన్ షాప్ వద్దు” అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ — కృత్తివెన్ను పోలీస్ స్టేషన్, ప్రభుత్వ ఆసుపత్రి, ఎండీవో కార్యాలయం, ఎంఆర్ఓ కార్యాలయం వంటి ముఖ్యమైన ప్రభుత్వ కార్యాలయాలకు వైన్ షాప్ కేవలం 10 మీటర్ల దూరంలో ఉండటం చాలా హాస్యాస్పదం, అనుచితం అని పేర్కొన్నారు.
ఇలాంటి ప్రదేశంలో మద్యం దుకాణం ఉండటం వల్ల ప్రజా శాంతి భద్రతలకు భంగం కలుగుతుందని, మహిళలు, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
వైన్ షాప్‌ను తక్షణమే తొలగించేందుకు ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు జోక్యం చేసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. ప్రజల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుని తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.







