
ప్రపంచ జనాభా దినోత్సవం–2025ను పురస్కరించుకుని జిల్లా కలెక్టరు కె. వెట్రిసెల్వి గారు సోమవారం ఏలూరు జిల్లా కలెక్టరేటు గోదావరి సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ దినోత్సవానికి సంబంధించి పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ, ప్రణాళికాబద్ధమైన మాతృత్వం కోసం గర్భధారణల మధ్య ఆరోగ్యకరమైన సమయం పాటించడం ఎంతో అవసరమన్నారు. మాతృత్వానికి ముందుగా సరైన మానసిక, శారీరక స్థితి అవసరం అని పేర్కొన్నారు. గర్భధారణల మధ్య తగినంత విరామం ఇచ్చినప్పుడు మాత్రమే ఆరోగ్యకరమైన శిశువులకు జన్మనిచ్చే అవకాశం ఏర్పడుతుందని ఆమె తెలిపారు.
వివాహ వయస్సు నియమావళిపై ఆమె ప్రత్యేకంగా దృష్టి సారించారు. మహిళలు కనీసం 21 సంవత్సరాలు, పురుషులు కనీసం 25 సంవత్సరాలు నిండిన తరువాతే వివాహం చేసుకోవాలని, ఇది కుటుంబ సంక్షేమానికి, తల్లీ-బిడ్డల ఆరోగ్యానికి ఎంతో అవసరమని స్పష్టం చేశారు.
జనాభా నియంత్రణ కేవలం సంఖ్యకోసం కాకుండా కుటుంబ ఆరోగ్యానికి సంబంధించిన అంశమని ఆమె వివరించారు. మహిళలు తల్లి కావడానికి శారీరకంగా, మానసికంగా సిద్ధంగా ఉన్నప్పుడే గర్భధారణ చేయాలని సూచించారు. గర్భధారణ సమయంలో తగిన వైద్యపరీక్షలు, పోషకాహారం, ఆస్పత్రిలో ప్రసవం, తల్లిపాలు, నవజాత శిశు సంరక్షణ మొదలైన అంశాలు కీలకమన్నారు.
తల్లి మరియు శిశు మరణాల తగ్గింపు కోసం ఆరోగ్య సిబ్బంది గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిరోజూ విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆమె హితవు పలికారు. ప్రభుత్వం అందిస్తున్న సేవలు ప్రజలకు చేరేలా చేయడంలో వైద్య శాఖ, ఆశా కార్యకర్తలు కీలకపాత్ర పోషించాలని ఆమె చెప్పారు. తల్లులకు పోషకాహారం అందించాలన్న అభ్యాసాన్ని పెంపొందించాలన్నారు.
ఈ సందర్భంగా జిల్లాలో ప్రజలలో జనాభా నియంత్రణపై అవగాహన పెంపొందించేందుకు పోస్టర్ల రూపంలో రూపొందించిన సందేశాలను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ పోస్టర్లు ప్రభుత్వ దవాఖానలు, పాఠశాలలు, కమ్యూనిటీ హాల్స్, గ్రామాల్లో ప్రదర్శించనున్నట్టు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టరు పి. ధాత్రిరెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. పి. జె. అమృత, డీసీహెచ్‌ఎస్ డా. పాల్ సతీష్, ఎన్టీఆర్ వైద్యసేవల కో-ఆర్డినేటర్ డా. రాజీవ్, యస్‌వో ఎన్. ఆనంద్ కుమార్, ఏయస్‌వో ఎం. కిషోర్ తదితర అధికారులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం ప్రజలకు ఆరోగ్యకరమైన కుటుంబ జీవన శైలిపై అవగాహన కల్పించడంలో కీలకమవుతుందని అంతా పేర్కొన్నారు.
ప్రణాళికా బద్ధమైన కుటుంబ జీవనం ప్రజల అభివృద్ధికి దోహదపడుతుందని సమావేశంలో ప్రతినిధులు అభిప్రాయపడ్డారు.







