
గుంటూరు, అక్టోబర్ 14: రాష్ట్రంలో మద్యం విషయంలో జరుగుతున్న పరిణామాలను ఉద్దేశించి జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఈ రోజు ఉదయం గుంటూరు లాడ్జ్ సెంటర్‌లోని జిల్లా జనసేన కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడారు.
గాదె మాట్లాడుతూ, “వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వంపై మట్టి చల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. గత ప్రభుత్వం కాలంలో ప్రభుత్వమే నాసిరకం మద్యం అమ్మకం చేపట్టి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడింది. ఇప్పుడు అదే వారు నిరసన పేరుతో నాటకాలు ఆడుతున్న దుస్థితి చూసి ప్రజలు ‘దొంగలే దొంగ’ అని అరిచినట్టైంది,” అన్నారు.వైసీపీ నాయకులు సోమవారం చేసిన నిరసన కార్యక్రమం తన లక్ష్యాన్ని కోల్పోయిందని, దాని వెనుక ఉన్న కుట్ర ప్రజల ముందే బయటపడిందని చెప్పారు. “జనార్దన్ రావు వాంగ్మూలంలో స్పష్టంగా పేర్కొన్న ప్రకారం, ఆయన చేసిన చర్యలన్నీ వైసీపీ నేత జోగి రమేష్ ఆదేశాలతో జరిగాయి. అయినా ఆయన ఇప్పటికీ మాట్లాడడం సిగ్గు చేటు,” అని విమర్శించారు.జోగి రమేష్ వ్యాఖ్యలపై స్పందిస్తూ, “తాను బీసీ సామాజిక వర్గానికి చెందినవాడిని, వంగవీటి రంగా అభిమానిని అని చెప్పుకుంటూ, ఏ ఒక్క బీసీ వర్గానికైనా ఉపయోగపడలేదని ప్రజలు గమనిస్తున్నారు,” అన్నారు. వంగవీటి రంగా పేరు చెప్పుకుని అనవసరంగా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయడం వల్లే వైసీపీ నాయకుల అభద్రతాభావం బయటపడుతోందన్నారు.కూటమి ప్రభుత్వంపై వైసీపీ ఆరోపణలు చేయడం అర్థరహితం అని పేర్కొన్న గాదె, “చంద్రబాబు కుటుంబాన్ని విమర్శించడం దారుణం. వారి ఇంటి చిన్నపిల్లల నుంచీ ఆడవాళ్ల వరకు ప్రస్తావించడం నీచం,” అని హెచ్చరించారు. జగన్ ప్రభుత్వంలో జరిగిన భూ కబ్జాల విషయంలో ప్రజలు తెలిసిన సత్యాన్ని మరచిపోరని తెలిపారు.మద్యం స్కాంలో వైసీపీ నేతల పాత్రపై వ్యాఖ్యానించిన గాదె, “జనార్దన్ రావు ద్వారా మద్యం తయారు చేయించి, ఎక్సైజ్ అధికారులకు పట్టించి ప్రభుత్వంపై దుష్ఫ్రచారం చేయాలని ప్రయత్నించారని, కానీ అది చివరికి వారి మెడకే చుట్టుకుందని” వ్యాఖ్యానించారు.ప్రస్తుతం రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను సమతూకంగా అమలు చేస్తోందని తెలిపారు. వైసీపీ నాయకులు ఇది ఓర్చుకోలేక ఇలాంటి చర్యలు చేపడుతున్నారని ఆరోపించారు.మాజీ మంత్రి ఆర్.కె. రోజాపై కూడా గాదె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “తన రాజకీయ జీవితాన్ని నిలబెట్టుకోవడం కోసమే ఆమె పవన్ కళ్యాణ్ గారిపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారు” అని అన్నారు. చివరగా, వైసీపీ నాయకులు మారి ప్రభుత్వానికి సహకరించాలన్నారు. లేదంటే రాష్ట్ర ప్రజలు గత ఎన్నికల్లో ఇచ్చిన తీర్పు కన్నా తీవ్రమైన తీర్పు ఇచ్చే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.ఈ సమావేశంలో జనసేన జిల్లా ఉపాధ్యక్షులు అడపా మాణిక్యాలరావు, ప్రచార కమిటీ కోఆర్డినేటర్ శిఖా బాలు, కార్యదర్శి చట్టాల త్రినాథ్, కార్పొరేటర్ యర్రంశెట్టి పద్మావతి, జనసేన నాయకులు పాపాబత్తిన లింగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.







