
బాపట్ల: డిసెంబర్ :-యోగ విద్య ఒక అద్భుతమని, తరతరాలపాటు అజరామరంగా నిలిచే మహత్తర విజ్ఞానమని బాపట్ల శాసనసభ్యులు శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు అన్నారు.
బాపట్ల జిల్లా జిల్లెల్లముడిలో గత మూడు రోజులుగా నిర్వహించిన జాతీయస్థాయి యోగాసన ఛాంపియన్‌షిప్–2025 ముగింపు సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… వివిధ యోగాసన భంగిమలను శరీరానికి అనుగుణంగా అత్యంత సులువుగా ప్రదర్శించిన యోగాభ్యాసకుల ప్రతిభ అద్భుతమని కొనియాడారు. ధనుస్సు వలె వంగుతూ చేసిన ఆసనాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయని తెలిపారు.
యోగ భారతీయ సంస్కృతిలో అంతర్భాగమని, దేశంలోని విభిన్న ప్రాంతాలకు చెందిన భిన్న జీవనశైలి, సంస్కృతులు కలిగిన ప్రజలను ఒకే వేదికపైకి తీసుకొచ్చే శక్తి యోగకే ఉందని వ్యాఖ్యానించారుBapatla Local News.
జాతీయస్థాయిలో విజేతలుగా నిలిచిన యోగాభ్యాసకులు అంతర్జాతీయ స్థాయిలో మరింత ప్రతిభ చాటాలని ఆకాంక్షించారు. అలాగే పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ తమ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు.
వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన విజేతలు శాస్త్రీయంగా ప్రదర్శించిన యోగాసనాలు ‘ఔరా’ అనిపించే స్థాయిలో ఉన్నాయని ప్రత్యేకంగా ప్రశంసించారు. సమాజంలో యోగాసనాల పట్ల ఆసక్తి, అనురక్తిని పెంపొందించడంలో ఇటువంటి ఛాంపియన్‌షిప్‌లు ఎంతో దోహదపడతాయని తెలిపారు.
ప్రతి ఒక్కరూ యోగాపై ఉన్న అపోహలు, అనుమానాలను తొలగించుకొని, మంచి గురువుల వద్ద శిక్షణ పొంది నిత్యం యోగాభ్యాసం చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన యువతి అనీషా భౌమిక్కు చాంపియన్ ఆఫ్ ఛాంపియన్‌షిప్ ట్రోఫీని ఎమ్మెల్యే నరేంద్ర వర్మ తన చేతుల మీదుగా అందజేశారు.
మూడు రోజులపాటు పండుగ వాతావరణంలో యోగ ఛాంపియన్‌షిప్–2025కు ఆతిథ్యం ఇచ్చిన జిల్లెల్లముడి శ్రీ విశ్వజనని పరిషత్ యాజమాన్యాన్ని ఎమ్మెల్యే అభినందించారు. పరిషత్ అందించిన సేవలు, సహాయ సహకారాలు ప్రశంసనీయమని పేర్కొంటూ, ఈ కార్యక్రమానికి కారణమైన ప్రతి ఒక్కరినీ పేరుపేరునా అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఇండియన్ యోగ ఫెడరేషన్ అధ్యక్షులు బ్రిడ్జ్ భూషణ్ పురోహిత్, ప్రధాన కార్యదర్శి మృణాల చక్రవర్తి, ఏపీ స్టేట్ యోగ అసోసియేషన్ అధ్యక్షులు కూన కృష్ణదేవరాయులు, చైర్మన్ కళ్ళం హరినాథ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి అల్లాడి రవికుమార్, వివేక సర్వీస్ సొసైటీ కార్యదర్శి అంబటి మురళీకృష్ణ, ప్రముఖ ఆడిటర్ చాపల సుబ్రహ్మణ్యం, కోఆర్డినేటర్ శ్రీమన్నారాయణతో పాటు శీలం శ్రీనివాసరావు, యార్లగడ్డ లక్ష్మీనారాయణ రెడ్డి, నాగరాజు, వీరభద్రయ్య, ఇమ్మడిశెట్టి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.










