
బాపట్ల: డిసెంబర్ 19:-ప్రేమ, దయ, క్షమ గుణాలకు ప్రతిరూపమైన ఏసుక్రీస్తు సూక్తులు నేటి సమాజానికి మార్గదర్శకమని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్ వి అన్నారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని క్రిస్టియన్, ముస్లిం మైనార్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం బాపట్ల పట్టణంలోని షాదీఖానా భవన్‌లో సెమీ క్రిస్మస్ వేడుకలు, తేనీటి విందు కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ క్రిస్మస్ కేకును కట్ చేసి క్రైస్తవ పెద్దలు, పాస్టర్లకు పంచిపెట్టారు. అనంతరం క్యాండిల్ లైట్ సర్వీస్ నిర్వహించారు.Bapatla Local News
కలెక్టర్ మాట్లాడుతూ ఏసుక్రీస్తు ప్రభువు అంటేనే ప్రేమ, దయ, క్షమ గుణాల సమాహారమని అన్నారు. ఆయన పుట్టినరోజును పండుగగా నిర్వహించడం ఆనందదాయకమన్నారు. క్రిస్మస్ పండుగ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతుందని, ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారని తెలిపారు. జిల్లా ప్రజలంతా శాంతి, సమాధానాలతో క్రిస్మస్ వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు.
అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, తారతమ్యాలు లేకుండా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నదని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రభుత్వం అధికారికంగా సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించడం అభినందనీయమన్నారు.
తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ, క్రిస్టియన్ మిషనరీ పాఠశాలల్లో విద్యార్థులు క్రమశిక్షణ, నైతిక విలువలు, విజ్ఞానంలో ముందుండేవారని, ఏసుక్రీస్తు సూక్తులు వారిపై గాఢమైన ప్రభావం చూపాయని తెలిపారు. అదే స్ఫూర్తితో క్రైస్తవ సోదరులు సమాజానికి మార్గదర్శకులుగా నిలవాలన్నారు.
జిల్లా క్రిస్టియన్, ముస్లిం మైనార్టీ సంక్షేమశాఖ అధికారి జగన్నాథం పార్థసారథి మాట్లాడుతూ క్రిస్మస్ ఆనందం అందరిలో నింపాలని, ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం సంతోషకరమన్నారు.
బాపట్ల ఆర్డీఓ పి. గ్లోరియా మాట్లాడుతూ మానవాళి రక్షణ కోసమే ఏసుక్రీస్తు జన్మించారని, ఆయన చూపిన మార్గం అనుసరణీయమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మేజర్ ఏసు పాదం వాక్యోపదేశం చేయగా, డీఆర్‌డీఏ పీడీ లవన్న, మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి, తహసిల్దార్ షాలీమా, ఫాదర్ ఇన్నయ్య, రెవరెండ్ పి. వరబాబు తదితరులు పాల్గొన్నారు.







