ఉప్పాల హారికపై దాడిని ఖండించిన వైఎస్ఆర్సిపి మహిళా నేతలు||YSRCP Women Leaders Condemn Attack on Uppala Harika
ఉప్పాల హారికపై దాడిని ఖండించిన వైఎస్ఆర్సిపి మహిళా నేతలు
ఉప్పాల హారికపై దాడి ఘటనను ఖండించిన వైఎస్ఆర్సిపి మహిళా నేతలు
“కూటమి పాలనలో మహిళలకు రక్షణ లేకపోవడం దురదృష్టకరం”
గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి మహిళా విభాగం శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో మహిళా నాయకులు మాట్లాడుతూ, ఇటీవల కృష్ణా జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఉప్పాల హారికపై తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు చేసిన దాడిని తీవ్రంగా ఖండించారు.
వారు పేర్కొన్నట్లుగా, వారం రోజులు గడిచినా ఈ ఘటనపై న్యాయమైన చర్యలు తీసుకోకపోవడం శోచనీయమని తెలిపారు. మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సిపి మహిళా అధ్యక్షురాలు చిలువూరు ఫిలోమినా మాట్లాడుతూ, “ఒక జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ అయిన మహిళా నేతను కార్లో నిర్బంధించి దౌర్జన్యం చేయడం ప్రజాస్వామ్యానికి భంగం,” అన్నారు. మహిళల రక్షణకు ప్రధమ బాధ్యత ఉన్న ప్రభుత్వమే మౌనంగా ఉండడం ఆందోళన కలిగిస్తోందని ఆమె విమర్శించారు.
మంగళగిరి పట్టణ అధ్యక్షురాలు సంకే సునిత మాట్లాడుతూ, “ఒక మహిళా ప్రజా ప్రతినిధిపై మారణాయుధాలతో దాడి చేసి, అసభ్య పదజాలంతో దూషించడం ఎలాంటి పాలననికైనా మచ్చతెస్తుంది,” అన్నారు. మహిళల హక్కుల పరిరక్షణ కోసం మాటలు చెప్పే చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు ఇప్పుడు మౌనంగా ఉన్నారని ఆమె మండిపడ్డారు.
గుంటూరు జిల్లా వైఎస్ఆర్సిపి ఉపాధ్యక్షురాలు పచ్చల రత్నకుమారి మాట్లాడుతూ, ఒక చైర్‌పర్సన్‌కు రక్షణ లేకపోతే సామాన్య మహిళల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు అన్నారు. బీసీల పార్టీగా ప్రచారం చేసుకునే తెలుగుదేశం, నిజంగా వారికి ఎలాంటి ప్రాధాన్యత ఇచ్చిందో చెప్పాలని ప్రశ్నించారు. లోకేష్ రెడ్ బుక్ పేరుతో వైఎస్ఆర్సిపి నాయకులపై అన్యాయంగా వేధింపులు కొనసాగుతున్నాయని మండిపడ్డారు.
జిల్లా యాక్టివిటీ కార్యదర్శి మల్లవరపు సుధారాణి మాట్లాడుతూ, “మహిళలు బయటకు వస్తే ప్రాణాలు గుప్పెట్టు పెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇది రాజ్యాంగ విలువలకు విరుద్ధం,” అన్నారు. జగన్ మోహన్ రెడ్డి పాలనలో మహిళల రక్షణకు ప్రాధాన్యం ఇచ్చారని గుర్తు చేస్తూ, ప్రస్తుతం మహిళలపై జరుగుతున్న దాడులను దృష్టిలో పెట్టుకొని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించకపోవడం విడ్డూరమన్నారు.
తాడేపల్లి పట్టణ అధ్యక్షురాలు దర్శి విజయశ్రీ మాట్లాడుతూ, హోం మంత్రి అనిత మహిళ అయినా మహిళలపై జరిగే దాడులను పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. దాడులు చేసిన వారిపై ఇప్పటికీ చర్యలు లేకపోవడం మహిళా సంఘాల అభ్యున్నతికి ముప్పుగా అభివర్ణించారు.
ఈ కార్యక్రమంలో దుగ్గిరాల మండల మహిళా అధ్యక్షురాలు పెండ్యాల సంసోనమ్మ, తాడేపల్లి మండల అధ్యక్షురాలు గోరా నాగ స్రవంతి, మాజీ కౌన్సిలర్ కలకోటి స్వరూపారాణి, ప్రధాన కార్యదర్శి తుమ్మ పద్మ, కార్యదర్శి గుంటి రాజ్యలక్ష్మి, మిట్ట నిర్మల తదితరులు పాల్గొన్నారు.