
బాపట్ల, జనవరి 28 :-యువత క్రీడల్లో ప్రతిభ కనబరిచేందుకు ప్రభుత్వం అవసరమైన అన్ని వసతులు కల్పించేందుకు కట్టుబడి ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్, ఐఏఎస్ తెలిపారు.
బుధవారం రాత్రి బాపట్ల జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియాన్ని జిల్లా కలెక్టర్ డా. వి.వినోద్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా స్టేడియంలో అందుబాటులో ఉన్న క్రీడా వసతులు, మౌలిక సదుపాయాల నిర్వహణ, శిక్షణ కార్యక్రమాల అమలు తీరును ఆయన సమగ్రంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, క్రీడాకారులు క్రమశిక్షణతో నిరంతర సాధన చేస్తూ జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు సాధించాలని ఆకాంక్షించారు. క్రీడా వసతుల మెరుగుదల కోసం అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.
అనంతరం స్టేడియంలో శిక్షణ పొందుతున్న క్రీడాకారులతో కలెక్టర్ నేరుగా మాట్లాడి, వారి అనుభవాలు, అవసరాలు, ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. క్రీడాకారుల సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.Bapatla Local News
ఈ కార్యక్రమంలో జిల్లా స్పోర్ట్స్ అధికారి శ్రీనివాసరావు, కోచ్‌లు, క్రీడాకారులు, స్టేడియం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.










