
జ్యూరిచ్, జనవరి 19:- తెలుగు జాతి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినప్పుడే తనకు నిజమైన సంతృప్తి ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వివిధ దేశాల్లో స్థిరపడ్డ తెలుగు ప్రజలు ఉద్యోగాలు చేసే స్థాయి నుంచి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని సీఎం ఆకాంక్షించారు. వినూత్నంగా ఆలోచిస్తే ఎన్నార్టీలు పారిశ్రామికవేత్తలుగా మారడం పెద్ద కష్టం కాదని ఆయన స్పష్టం చేశారు.

దావోస్ తొలి రోజు పర్యటనలో భాగంగా జ్యూరిచ్‌లో ఏర్పాటు చేసిన తెలుగు డయాస్పోరా కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… “దావోస్‌కు నేను తొలిసారి వచ్చినప్పుడు భారతీయులు చాలా తక్కువగా ఉండేవారు. తెలుగు వాళ్లు అసలు లేరు. కానీ ఇప్పుడు జ్యూరిచ్ పరిస్థితి విజయవాడలోనా, తిరుపతిలోనా అన్నట్లుగా మారింది. 20 దేశాల నుంచి తెలుగు వారు ఈ కార్యక్రమానికి రావడం సంతోషంగా ఉంది. ప్రపంచంలోని 195 దేశాల్లో తెలుగు వారు ఉన్నారు. 148 దేశాల్లో ఎన్నార్టీ వ్యవస్థను ఏర్పాటు చేశాం” అని తెలిపారు.
విజన్–2020, ఐటీ గురించి మాట్లాడిన రోజుల్లో విమర్శలు ఎదురయ్యాయని, కానీ ఆనాడు తీసుకున్న నిర్ణయాల వల్లే నేడు తెలుగు వారు ప్రపంచవ్యాప్తంగా అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారని చెప్పారు. పీవీ నరసింహారావు చేపట్టిన ఆర్థిక సంస్కరణలు దేశానికి గర్వకారణమని అన్నారు. 2047 నాటికి భారత్ ప్రపంచంలో నెంబర్–1 ఆర్థిక శక్తిగా ఎదుగుతుందని, ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశానికి బలమైన నాయకత్వం ఉందని సీఎం వ్యాఖ్యానించారు.

ఎన్నికల్లో ఎన్నార్టీల సహకారం మరువలేం
ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్నార్టీల పాత్రను సీఎం ప్రత్యేకంగా గుర్తు చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా పవన్ కళ్యాణ్ సహకరించారని, బీజేపీ కలిసి రావడంతో కూటమి విజయవంతమైందని చెప్పారు. ప్రజల ఆశీస్సులు, ఎన్నార్టీల సహకారంతో 93 శాతం స్ట్రైక్ రేట్‌తో ఘన విజయం సాధించామని తెలిపారు.
18 నెలల వ్యవధిలోనే రాష్ట్ర బ్రాండ్‌ను పునరుద్ధరించామని, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంతో ముందుకు వెళ్తున్నామని అన్నారు. దేశానికి వచ్చిన పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే రావడం గర్వకారణమని, గూగుల్, ఆర్సెలార్ మిట్టల్ వంటి సంస్థలు భారీ పెట్టుబడులు పెట్టాయని తెలిపారు. రూ.22 లక్షల కోట్ల పెట్టుబడులపై కసరత్తు జరుగుతోందని, ఇది సాకారమైతే 20 లక్షల ఉద్యోగాలు కల్పించగలమని సీఎం వివరించారు.

ఒకరు ఉద్యోగం… మరొకరు వ్యాపారం
Amaravathi news:రాష్ట్రంలో 21 మంది ఐపీఎస్‌ల బదిలీలు, నియామకాలుతెలుగు జాతి ఉద్యోగాలు చేసే వాళ్లుగా కాకుండా ఉద్యోగాలు ఇచ్చే వాళ్లుగా ఎదగాలని సీఎం పిలుపునిచ్చారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా స్టార్టప్స్‌ను ప్రోత్సహిస్తున్నామని, ‘వన్ ఫ్యామిలీ–వన్ ఎంటర్‌ప్రెన్యూర్’ ప్రభుత్వ విధానమని తెలిపారు. ఎన్నార్టీలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు రూ.50 కోట్లతో ఏపీ ఎన్నార్టీ కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
విదేశీ విద్య… మా బాధ్యత
విదేశాల్లో చదవాలనుకునే ప్రతి విద్యార్థికి అవకాశం కల్పిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ప్రభుత్వ గ్యారెంటీతో 4 శాతం వడ్డీకి రుణాలు అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. తిరుపతిలో ఐఐటీ–ఐఐఎస్ఈఆర్ కాంబినేషన్‌తో ‘ఏపీ ఫస్ట్’ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.

ఉత్సాహంగా సాగిన డయాస్పోరా కార్యక్రమం
తెలుగు డయాస్పోరా కార్యక్రమం అంతటా ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. ఐరోపాలోని 20 దేశాల నుంచి తెలుగు ప్రజలు కుటుంబాలతో హాజరయ్యారు. వివిధ నియోజకవర్గాల పేర్లు సీఎం ప్రస్తావించినప్పుడు సభికుల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించింది. స్విట్జర్లాండ్ తెలుగు అసోసియేషన్ నిర్వహించిన సంక్రాంతి పోటీల్లో విజేతలకు సీఎం చంద్రబాబు బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం తెలుగు కుటుంబాలను ఆత్మీయంగా పలకరించి గోదావరి పుష్కరాలకు రావాల్సిందిగా ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్, ఏపీ ఎన్నార్టీ సొసైటీ అధ్యక్షుడు వేమూరి రవి పాల్గొన్నారు.










