ప్రభుత్వం 590 జీవో ద్వారా 10 ప్రభుత్వ వైద్య కళాశాలలను పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ పేరుతో ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలనే ప్రయత్నాన్ని వ్యతిరేకిస్తూ ఈనెల 19వ తేదీ ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5గంటల వరకు విజయవాడలోని ఎమ్.బి భవన్ ఆడిటోరియంలో రాష్ట్ర సదస్సును నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు డా|| ఆలా వెంకటేశ్వర్లు తెలిపారు. ఈమేరకు గుంటూరులోని జనచైతన్య వేదిక హాలులో జరిగిన మీడియా సమావేశంలో మాజీ శాసనమండలి సభ్యులు కె.ఎస్ లక్ష్మణరావు, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. ధనుంజయ రెడ్డి, వై.ఎస్.ఆర్.సి.పి విద్యార్థి విభాగ గుంటూరు జిల్లా అధ్యక్షులు సి.హెచ్. వినోద్ కుమార్ పాల్గొని ప్రసంగించారు. డా|| ఆలా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విద్య, వైద్యం ప్రభుత్వ రంగంలో కొనసాగితేనే పేదల అభివృద్ధి సాధ్యమౌతుందన్నారు. సేవారంగంలో కొనసాగాల్సిన విద్య, వైద్యాన్ని ప్రైవేటు రంగానికి తరలించడం భావ్యం కాదన్నారు. ఆంధ్రప్రదేశ్ లోని పి పి పి విధానాన్ని వ్యతిరేకిస్తున్న విద్యార్థి యువజన సంఘాలు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, మేధావులoదరినీ అక్టోబర్ 19న జరిగే రాష్ట్ర సదస్సుకు ఆహ్వానించి ఉద్యమ కార్యాచరణతో భవిష్యత్తు పోరాట కార్యక్రమాలను ప్రకటిస్తామన్నారు. మాజీ శాసనమండలి సభ్యులు కె. ఎస్. లక్ష్మణరావు ప్రసంగిస్తూ గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన 17 ప్రభుత్వ వైద్య కళాశాలలో ఐదింటిని పూర్తిచేసి ప్రవేశాలు కల్పించిందని, మరో రెండు కళాశాలలు నిర్మాణం పూర్తి చేసుకుని సిద్ధంగా ఉన్న తరుణంలో నేటి కూటమి ప్రభుత్వం 10 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పరోక్షంగా ప్రైవేటు పరం చేయాలని భావించడం దుర్మార్గమన్నారు. అమరావతి రాజధాని నిర్మాణానికి లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేయడాన్ని సిద్ధంగా ఉన్న ప్రభుత్వం పేదలకు ఉచిత వైద్యం, వైద్య విద్యను అందించే 10 ప్రభుత్వ వైద్య కళాశాలల పై 5 వేల కోట్లు ఖర్చు చేయలేని దీనస్థితిలో ఉందా అని ప్రశ్నించారు. జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ విద్యా, వైద్య రంగాలపై పెట్టే పెట్టుబడులను వ్యయంగా భావించరాదని, దేశాభివృద్ధికి ఉన్నతమైన మానవ వనరుల అభివృద్ధిగా భావించాలన్నారు. పి పి పి ని వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా పలు సంస్థలు ఉద్యమిస్తున్నాయని, వాటిన్నoటిని ఏకత్రాటి పైకి తీసుకొచ్చి ఐక్య ఉద్యమ నిర్మాణం కోసం రాష్ట్ర సదస్సును అక్టోబర్ 19న విజయవాడలో ఎం.బి. భవన్ లో నిర్వహిస్తున్నామని తెలుపుతూ రాష్ట్ర సదస్సును జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు.
1,005 1 minute read