పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురానికి కేంద్ర ప్రభుత్వం మరో కీలక రైలు సౌకర్యాన్ని అందించబోతోంది. ఇప్పటికే రాష్ట్రంలో వందే భారత్ రైళ్లకు మంచి స్పందన లభిస్తున్నప్పటికీ, పశ్చిమ గోదావరి ప్రాంత ప్రజలకు ఈ సౌకర్యం అందకపోవడంపై ఎన్నో వాదనలు వినిపించాయి. ఈ నేపథ్యంలో నరసాపురం నుండి చెన్నై వరకు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ త్వరలో నడవనున్నట్లు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఇటీవల వెల్లడించారు.
ప్రస్తుతం విజయవాడ వరకు మాత్రమే నడుస్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును నరసాపురం వరకు పొడిగిస్తారని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే రైల్వే శాఖ దాని కోసం అవసరమైన ఏర్పాట్లు ప్రారంభించింది. ముఖ్యంగా నరసాపురం రైల్వే స్టేషన్ అభివృద్ధికి సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయి. జల సరఫరా వ్యవస్థ, ప్లాట్‌ఫాం విస్తరణ, ట్రాక్ పనులు మొదలై 70 శాతం వరకు పూర్తి కావచ్చాయని అధికారులు వెల్లడించారు. విజయవాడ జంక్షన్‌లో ప్లాట్‌ఫాంల కొరత కారణంగా వందే భారత్ రైలు ఎక్కువసేపు నిలిచి ఉండాల్సి వస్తున్న పరిస్థితి ఉంది. ఇది ఇతర రైళ్ల రాకపోకలపై ప్రభావం చూపుతుందని కేంద్ర మంత్రి చెప్పారు.
ఈ పరిస్థితుల్లో ఆ రైలు విజయవాడకు బదులు నరసాపురం వరకు కొనసాగితే ప్రయాణికులకు లబ్ధి చేకూరుతుంది. నరసాపురం రైల్వే స్టేషన్ సమీపంలోని పట్టణాలకు కూడా సౌకర్యం కలుగుతుందన్నది అధికారుల అభిప్రాయం. నరసాపురానికి వందే భారత్ రైలు రాకతో పశ్చిమ గోదావరి జిల్లాకు మరో ప్రధాన రవాణా ద్వారం ఏర్పడుతుంది. వ్యాపారం, పర్యాటకం, విద్యార్ధులు, ఉద్యోగస్తులు ఇలా అన్ని వర్గాలకూ ప్రయోజనం చేకూరనుంది.
రాష్ట్రంలో ఇప్పటికే విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమహేంద్రవరం వంటి పట్టణాలకు వందే భారత్ రైళ్లు అందుబాటులో ఉన్నా, పశ్చిమ గోదావరి జిల్లాకు ఈ సేవలు దూరంగానే ఉన్నాయి. కాబట్టి ఈ కొత్త రూట్ ప్రారంభమవడం పట్ల స్థానిక ప్రజలు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. కేంద్రం నుంచి పక్కా ఆమోదం వచ్చాక, నరసాపురం స్టేషన్‌కు కావలసిన మిగిలిన మౌలిక వసతులను కూడా పూర్తిచేయనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. కేవలం రైలును పొడిగించడం మాత్రమే కాదు, భవిష్యత్తులో పునరుద్ధరించబడిన స్టేషన్లు, ఆధునిక సౌకర్యాలు కూడా ప్రయాణీకులకు అందుబాటులోకి రానున్నాయి.
ముఖ్యంగా వందే భారత్ రైళ్లు తక్కువ సమయంలో ఎక్కువ దూరం ప్రయాణం చేయగలవు కాబట్టి ప్రజలకు సమయం, ఖర్చు రెండింటిలోనూ మేలు జరుగుతుంది. కేంద్రం ప్రతిపాదించిన ప్రణాళిక ప్రకారం, కొత్త మార్గం త్వరలోనే అధికారికంగా ప్రకటించి షెడ్యూల్‌కి తగ్గట్టుగా వందే భారత్ రైలు నడిపేలా అధికారులు సిద్ధమవుతున్నారు.