
ప్రతీ క్షణం జీవితాన్ని తన కుటుంబం కోసమే ఖర్చు పెడుతూ తాను వెలుగుతూ, కరిగిపోతున్న గృహిణుల త్యాగం కొలవలేమని.. వారి సేవలు వెలకట్టలేనివని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ అన్నారు. విజయవాడలోని కేవీఎస్ సిద్ధార్ధ ఫార్మాస్యూటికల్ కళాశాలలో సోమవారం ‘జాతీయ గృహిణుల దినోత్సవం’ ఘనంగా నిర్వహించారు. మార్పు ట్రస్టు, మహిళా స్టడీసెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిక ఈ కార్యక్రమానికి డాక్టర్ రాయపాటి శైలజ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గృహిణులు వంటింటికే పరిమితం అనే భావన నుంచి బయటపడి. వారి శ్రమలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. కష్టసుఖాల్లో చేదోడువాదోడుగా ఉంటూ సమాన అవకాశాలు, హక్కులు కల్పించాలన్నారు. ఇంటి వాతావరణంలో తల్లులు తమ పిల్లల్ని పెంచేటప్పుడు అమ్మాయిలను, అబ్బాయిలను లింగ ఆధారంగా అణిచి వేయరాదని ఆమె పిలుపునిచ్చారు. ముఖ్యంగా మహిళల చదువులకు పెద్దపీట వేయాలన్నారు. మహిళల ఆరోగ్యానికి కుటుంబ సభ్యులు, ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలన్నారు. మహిళల్లో ముఖ్యంగా గృహిణుల్లో చాలామందికి పోషకాహారం లోపం ఎక్కువగా ఉంటుంది అని ఆరోగ్య సర్వే పేర్కొంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా కాలంలో ఎక్కువగా వీరికే నష్టం వాటిల్లిందని.. ఇంట్లో తల్లిదండ్రులు, అత్తమామలుల భర్త పిల్లల పోషణలోనే గృహిణుల జీవితం గడిచిపోతుందన్నారు. దీంతో వారి ఆరోగ్యం క్షీణిస్తుందని బాధను వ్యక్తం చేశారు. చదువుకుని, ఉద్యోగం చేస్తున్న గృహిణుల జీవితాల్లో కూడా అణచివేత, హింసా జరుగుతూనే ఉందని, బాలికలు, మహిళలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. వరల్డ్ కప్ కాంపిటీషన్ లో ఇండియా తరఫున ఆడి గెలిచిన ఉమెన్ క్రికెట్ టీమ్ కు కేక్ కటింగ్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్పు ట్రస్ట్ అధినేత ఆర్. సూయజ్, కళాశాల ప్రిన్సిపాల్ ఎ.సుమతి, తదితరులు పాల్గొన్నారు.
 
 






