
అమరావతి:06-11-25:-రాజధాని ప్రాంతంలోని పెద్ద పరిమి గ్రామంలో తుఫాను ప్రభావంతో పత్తి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కానీ తుఫాను దాటిపోయి రోజులు గడిచినా, అధికారులు పంట నష్టాన్ని అంచనా వేయడానికి కూడా రాకపోవడం నిర్లక్ష్యానికి పరాకాష్ట అని ఆమ్ ఆద్మీ పార్టీ జోనల్ కోఆర్డినేటర్ నేతి మహేశ్వరరావు తీవ్రంగా విమర్శించారు.మహేశ్వరరావు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కంభంపాటి కృష్ణ, పర్వతనేని హరికృష్ణ, రైతు సంఘ నాయకుడు సాంబశివరావు తదితరులు పంటలను పరిశీలించారు. పంట నష్టాన్ని ప్రత్యక్షంగా పరిశీలించిన అనంతరం రైతులతో మాట్లాడుతూ మహేశ్వరరావు గారు, “నష్టపోయిన రైతులలో చాలా మంది కౌలు రైతులు. కానీ గ్రామంలోని భూయజమానులు, పెద్దలు వారి సమస్యలను బయటపెట్టకుండా అణచివేస్తున్నారు” అని వ్యాఖ్యానించారు.ఆయన మరోవైపు, “తుఫాను సమయంలో చంద్రబాబు నాయుడు సమన్వయం బాగానే చేసినా, తుఫాను వల్ల నష్టపోయిన రైతులను పూర్తిగా మరిచిపోయారు. రైతుల సగటు వయసు ఇప్పటికే 50 ఏళ్లు దాటింది. ఇలాగే నిర్లక్ష్యం కొనసాగితే భవిష్యత్తులో రైతులు కనిపించరని చెప్పడం అతిశయోక్తి కాదు” అన్నారు.
“ప్రభుత్వం తక్షణమే పంట నష్టాన్ని అంచనా వేసి, పూర్తి నష్టపరిహారం ప్రకటించాలి. అభివృద్ధి అంటే కేవలం పారిశ్రామిక అభివృద్ధి మాత్రమే కాదు – వ్యవసాయం కూడా దానికి అంతే ముఖ్యమైన భాగం. కాబట్టి పరిశ్రమలకు ఇచ్చే ప్రాధాన్యత వ్యవసాయానికి కూడా ఇవ్వాలి,” అని ఆయన డిమాండ్ చేశారు.మహేశ్వరరావు గారు కౌలు రైతులకు రుణ సదుపాయాలు కల్పించాలని, పండిన పంటలకు మద్దతు ధర ఇవ్వాలని, పంట నష్టపోయిన రైతులకు పూర్తి పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.ఇక రైతు నాయకుడు సాంబశివరావును భయపెట్టే ప్రయత్నం జరిగిన నేపథ్యంలో, నేతి మహేశ్వరరావు గ్రామ కేంద్రంలోనే నిరసనకు దిగారు. “రైతును కాపాడాలి – అధికారులు వెంటనే వచ్చి పంట నష్టాన్ని అంచనా వేయాలి – ఎమ్మెల్యే, వ్యవసాయశాఖ మంత్రి గ్రామానికి రావాలి” అంటూ నినాదాలు చేశారు.ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు, టిడిపి నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం తుళ్లూరు సిఐ శ్రీనివాస్ రావు పరిస్థితిని సమీక్షించి, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించారు. రాత్రి 8:30 గంటలకు వారిని విడుదల చేశారు.మహేశ్వరరావు చివరగా మాట్లాడుతూ, “భూమున్న రైతులమందరం కౌలు రైతులకు పార్టీలకతీతంగా అండగా ఉండాలి. రైతు సమస్యలపై ఐక్యంగా నిలబడితేనే వ్యవసాయం బతుకుతుంది” అన్నారు.







