పామర్రు, ఆగస్టు 7 :– ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటిని నిబంధనల మేరకు త్వరితగతిన పరిష్కరించేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక ‘మీకోసం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు.
పామర్రు నియోజకవర్గంలోని ఎస్కేఆర్ఆర్ జెడ్పీ ఉన్నత పాఠశాల ఎదురుగా ఉన్న ఆరేపల్లి కల్యాణ మండపంలో శుక్రవారం నిర్వహించిన ‘మీకోసం’ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను ఓర్పుగా విని, సంబంధిత శాఖల అధికారులకు వెంటనే పంపించి నిబంధనల ప్రకారం త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్, సహాయ కలెక్టర్ నమ్రత అగర్వాల్, డీఎస్పీ పల్లా శ్రీనివాసరావుతో కలిసి జిల్లా కలెక్టర్ ప్రజల సమస్యలను పరిశీలించారు.
షాపుల అద్దెలు తగ్గించాలంటూ వ్యాపారుల విజ్ఞప్తి
మొవ్వ మండలం మొవ్వ గ్రామానికి చెందిన వ్యాపారులు ఎస్. ఉదయ్ భాను, ఎస్.కె. అమీర్, ఎం. లోకేష్ తదితరులు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో నిర్మించిన కొత్త షాపుల నెలవారీ అద్దెను తగ్గించాలని జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ప్రస్తుతం వ్యాపార పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో అద్దె, విద్యుత్ బిల్లులు, కార్మికుల వేతనాలు, ఇతర నిర్వహణ ఖర్చులు భరించడం భారంగా మారిందని తెలిపారు. పాత షాపులతో పోలిస్తే కొత్త షాపుల అద్దె ప్రతి ఏడాది పెరుగుతుండటంతో చిన్న వ్యాపారులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంటూ అద్దెను పునఃపరిశీలించాలని కోరారు.
భూముల నమోదు పూర్తి చేసి పాసుపుస్తకాలు ఇవ్వాలని రైతుల వినతి
తోట్లవల్లూరు మండలం కనిగిరిలంక గ్రామానికి చెందిన కే. శారద, జి. అనుష, కే. శివపార్వతి, జి. పద్మ, ఆర్. రమేష్ బాబు, కె. సాంబశివరావు తదితరులు తమ వ్యవసాయ భూములను ఆన్లైన్లో నమోదు చేసి అడంగల్, పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు. ఎన్నో సంవత్సరాలుగా పాసుపుస్తకాలు లేకపోవడంతో అన్నదాత సుఖీభవ వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందలేకపోతున్నామని తెలిపారు. రీ-సర్వే అనంతరం ఫిర్యాదుల కారణంగా నిలిచిపోయిన భూముల నమోదు ప్రక్రియను పూర్తి చేసి పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
కొత్త మటన్ మార్కెట్ నిర్మించాలని వర్తకుల అర్జీ
పామర్రు గ్రామంలోని గఫార్ సెంటర్ మటన్ మార్కెట్‌కు చెందిన వర్తకులు శిథిలావస్థకు చేరిన పాత షాపులను తొలగించి ఆధునిక సౌకర్యాలతో కొత్త మటన్ మార్కెట్ నిర్మించాలని జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. దాదాపు వందేళ్ల క్రితం నిర్మించిన ఈ షాపులు ప్రస్తుతం ప్రమాదకర స్థితిలో ఉండటంతో వ్యాపారులు, కార్మికులు ప్రాణభయంతో విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. గ్రామపంచాయతీకి ఆదాయం అందిస్తున్న ఈ మార్కెట్‌ను ఆధునీకరించి ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని కొత్త భవనాలు నిర్మించాలని కోరారు.
కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.



