NTR District News :నకిలీ మిరప మొక్కలతో మోసపోయిన రైతులు.. 50 రోజుల శ్రమ బూడిదలో పోసిన పన్నీరే

Sharat

పెనుగంచిప్రోలు :– అహోరాత్రులు కష్టపడి, మోటార్ల నీటితో పంటను కాపాడుకుంటూ వచ్చిన రైతులకు తీరని అన్యాయం జరిగింది. నమ్మి కొనుగోలు చేసిన మిరప నారు (మొక్కలు) నాణ్యతా లోపంతో విఫలమవ్వడంతో, 50 రోజుల రైతుల కష్టం, పెట్టిన పెట్టుబడి అంతా బూడిదలో పోసిన పన్నీరైంది.

సంఘటన వివరాల్లోకి వెళితే: ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం ముచ్చింతాల గ్రామానికి చెందిన కొందరు రైతులు భీమవరం, చందర్లపాడు మండలాల్లోని ఒక ప్రముఖ కంపెనీకి చెందిన మిరప మొక్కలను కొనుగోలు చేశారు. ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోయినప్పటికీ, వేలాది రూపాయలు వెచ్చించి సుమారు 20 ఎకరాలకు సరిపడా మిరప మొక్కలను నాటారు. ఉన్న కొద్దిపాటి మోటార్ నీటితో, ఎంతో ఆశతో 50 రోజుల పాటు రేయింబవళ్లు శ్రమించి పంటను పెంచారు.NTR distric news :ఆరోగ్యవంతమైన మీడియా సమాజానికి యోగా దివ్య ఔషధం: కలెక్టర్ డా. జి. లక్ష్మీశ

అవాక్కైన రైతాంగం: తీరా 50 రోజుల తర్వాత మొక్కలలో ఎదుగుదల లేకపోవడం, పంట దెబ్బతినడంతో సదరు కంపెనీ ప్రతినిధులను రైతులు నిలదీశారు. దీనిపై స్పందించిన కంపెనీ యాజమాన్యం తమ మొక్కలు “ఫెయిల్ అయ్యాయని” బాధ్యతారాహిత్యంగా సమాధానమిచ్చింది. అంతేకాకుండా, తాము జరిగిన నష్టానికి నష్టపరిహారం ఇవ్వలేమని, కేవలం ‘మొక్కకు బదులు మరో మొక్క’ మాత్రమే ఇస్తామని తెగేసి చెప్పడంతో రైతులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

న్యాయం చేయాలని డిమాండ్: కంపెనీ వైఖరితో విసిగిపోయిన రైతులు శనివారం మీడియా ముందుకు వచ్చి తమ ఆవేదనను వెళ్లగక్కారు. “వాతావరణం సహకరించకపోయినా అప్పులు చేసి ఎకరానికి వేల రూపాయలు వెచ్చించాం. 50 రోజుల శ్రమ, నీళ్లు, ఎరువులు, కూలీల ఖర్చులు అంతా వృథా అయ్యాయి. ఇప్పుడు కేవలం మొక్కలు మాత్రమే ఇస్తామనడం ఏంటి? మాకు జరిగిన పంట నష్టానికి, చేసిన శ్రమకు తగిన నష్టపరిహారం చెల్లించాలి” అని రైతులు కన్నీటిపర్యంతమయ్యారు.

వ్యవసాయ శాఖ అధికారులు తక్షణమే స్పందించి, సదరు కంపెనీపై చర్యలు తీసుకుని, తమకు న్యాయం జరిగేలా చూడాలని బాధిత రైతులు కోరుతున్నారు.

Author
Share This Article
Leave a review