గుంటూరు, నవంబర్ 11:- జిల్లాలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) ఏర్పాటును వేగవంతం చేసి, పారిశ్రామిక అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సి.ఎం. సాయికాంత్ వర్మ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం పారిశ్రామికవేత్తలతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాల (ఎంఓయూలు) అమలులో నిర్లక్ష్యం లేకుండా చూడాలని స్పష్టం చేశారు.
బుధవారం కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, రెవెన్యూ, పరిశ్రమల శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో ఎంఎస్ఎంఈల ఏర్పాటుకు సంబంధించి ఇప్పటివరకు చేపట్టిన చర్యలు, భూసేకరణ, మౌలిక వసతుల కల్పన, పరిశ్రమల స్థాపన పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఇప్పటికే ప్రభుత్వంతో ఎంఓయూలు కుదుర్చుకున్న పారిశ్రామికవేత్తలు తమ పరిశ్రమల ఏర్పాటును వెంటనే ప్రారంభించేలా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. ఒప్పందాలు చేసుకోవడంతోనే సరిపెట్టకుండా క్షేత్రస్థాయిలో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అనుమతులు, వసతులు కల్పించి గ్రౌండింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు.
గుంటూరు తూర్పు, గుంటూరు పశ్చిమ, మంగళగిరి, తెనాలి నియోజకవర్గాల పరిధిలో ఎంఎస్ఎంఈల స్థాపనకు అనువైన స్థలాలను గుర్తించాలని సూచించారు. భూసేకరణకు సంబంధించిన ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి పరిశ్రమల ఏర్పాటుకు మార్గం సుగమం చేయాలని స్పష్టం చేశారు.
పరిశ్రమల స్థాపనకు ఎదురవుతున్న సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి, సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా పరిశ్రమల ఏర్పాటులో పురోగతి సాధించాలని, ఎంఓయూలను కార్యరూపంలోకి తీసుకువచ్చేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్లాలని సూచించారు.Guntur City News
ఈ సమావేశంలో డీఆర్ఓ ఎన్.ఎస్.కె. ఖాజావలి, గుంటూరు, తెనాలి ఆర్డీవోలు శ్రీనివాసరావు, శ్రీ రమణి, పరిశ్రమల శాఖ జీఎం జయలక్ష్మి, జిల్లా ఉపాధి కల్పన అధికారి అభినవ్ తదితరులు పాల్గొన్నారు.



