Eluru:షైనింగ్ స్టార్స్‌లో సత్తా చాటిన సెయింట్ థెరిస్సా కళాశాల విద్యార్థులు

City News Telugu

రాష్ట్ర స్థాయిలో కీర్తనకు గుర్తింపు.. జిల్లా స్థాయిలో నలుగురు విద్యార్థుల ప్రతిభ

CITY NEWS TELUGU | ఏలూరు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “షైనింగ్ స్టార్స్” కార్యక్రమాన్ని ఏలూరులోని సీఆర్ రెడ్డి కళాశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను జిల్లా కలెక్టర్ అభినందించి, పురస్కారాలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఏలూరు సెయింట్ థెరిస్సా జూనియర్ కళాశాల విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచి కళాశాలకు గర్వకారణంగా నిలిచారని కళాశాల వైస్ ప్రిన్సిపల్ సిస్టర్ శిరీష తెలిపారు. 2025–26 విద్యా సంవత్సరానికి చెందిన నలుగురు విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి షైనింగ్ స్టార్స్‌గా గుర్తింపు పొందడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

వీరిలో మన్విత – హెచ్‌ఈసీ, షేక్ మునీర్సా – సీఈసీ, కీర్తన – ఈఈటీ, గాయత్రి పట్నాయక్ – ఎంపీహెచ్‌డబ్ల్యూ విభాగాల్లో ప్రతిభ కనబరిచినట్లు తెలిపారు. ముఖ్యంగా కీర్తన రాష్ట్ర స్థాయిలో బెస్ట్ స్టూడెంట్ అవార్డు సాధించడం కళాశాలకు మరింత గర్వకారణమని పేర్కొన్నారు. విద్యార్థుల విజయానికి కృషి చేసిన అధ్యాపకులు, తల్లిదండ్రులను అభినందించారు.EluruDistrict

షైనింగ్ స్టార్‌గా ఎంపికైన విద్యార్థిని మన్విత మాట్లాడుతూ, హెచ్‌ఈసీలో వెయ్యి మార్కులకు 948 మార్కులు సాధించి ఏలూరు జిల్లా నుంచి షైనింగ్ స్టార్స్‌కు ఎంపిక కావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. తన విజయానికి కళాశాల యాజమాన్యం, సిస్టర్ శిరీష, అధ్యాపకులు, తల్లిదండ్రులు అందించిన ప్రోత్సాహమే కారణమని తెలిపారు. భవిష్యత్తులో ఐఏఎస్ అధికారిణి కావడమే తన లక్ష్యమని, డిగ్రీ నుంచే సివిల్ సర్వీసెస్‌కు సిద్ధమవుతానని చెప్పారు.

మరో విద్యార్థిని మాట్లాడుతూ, చదువుతో పాటు క్రీడల్లోనూ కళాశాల నుంచి మంచి ప్రోత్సాహం లభించిందని తెలిపారు. ప్రస్తుతం డిగ్రీలో బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ చదవనున్నానని, భవిష్యత్తులో రైల్వే పోలీస్‌లో ఉద్యోగం సాధించడమే తన లక్ష్యమని పేర్కొన్నారు.

విద్యార్థుల విజయాలు రాబోయే తరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని, మరింత మంది విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని విజయాలు సాధించాలని కళాశాల యాజమాన్యం ఆకాంక్షించింది.

Share This Article
Leave a review