ఏలూరు: జూలై 29 : – ఏలూరు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఇటీవల చోటుచేసుకున్న నవజాత శిశువు మృతిపై సమగ్ర విచారణ నిర్వహించి, బాధ్యులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి స్పష్టం చేశారు. బుధవారం రాష్ట్ర వైద్య విద్యా శాఖ డైరెక్టర్ డా. విష్ణువర్ధన్‌తో కలిసి ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని సందర్శించిన కలెక్టర్, ఈ నెల 23న మృతిచెందిన నవజాత శిశువు కుటుంబ సభ్యులను కలిసి వారి వేదనను తెలుసుకుని ఓదార్చారు.
ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ శిశువు మృతిచెందిందని కలెక్టర్, డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన కలెక్టర్, కేసు షీట్లు, వైద్య రికార్డులను పూర్తిస్థాయిలో పరిశీలించి నిష్పక్షపాత విచారణ జరిపి బాధ్యులపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
అనంతరం ఆసుపత్రిలోని పలు వార్డులను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ వెట్రిసెల్వి, పోస్ట్ ఆపరేటివ్ వార్డులో ఉన్న సౌకర్యాలను పరిశీలించారు. అక్కడ చికిత్స పొందుతున్న రోగులను నేరుగా కలిసి వైద్య సేవలపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. తనిఖీల్లో ఆసుపత్రిలోని సీసీ కెమెరాలు పనిచేయకపోవడం, బెడ్‌షీట్లు మురికిగా, చిరిగిపోయి ఉండటం గమనించిన కలెక్టర్ సంబంధిత సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓపీ, ఐపీ కౌంటర్ల వద్ద రోగులు ఎక్కువసేపు నిరీక్షించాల్సిన పరిస్థితి లేకుండా వేగంగా నమోదు ప్రక్రియ పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. వైద్యులు, వైద్య సిబ్బంది సమయపాలనను కచ్చితంగా పాటించాలని, ప్రతి విభాగాధిపతి ఓపీ సమయంలో రోగులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పోస్ట్ ఆపరేటివ్ వార్డుకు అవసరమైన ఆధునిక వైద్య పరికరాలను కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్) నిధుల ద్వారా సమకూర్చే ప్రయత్నాలు చేస్తామని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించి ప్రజల్లో విశ్వాసాన్ని మరింత పెంచేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్ర వైద్య విద్యా శాఖ డైరెక్టర్ డా. విష్ణువర్ధన్ మాట్లాడుతూ, నవజాత శిశువు మృతిపై ఇప్పటికే విచారణ ప్రారంభించామని తెలిపారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన డా. అనిల్‌ను విచారణ అధికారిగా నియమించామని, నివేదిక అందిన వెంటనే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఏలూరు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఓపీ, ఐపీ నమోదు సంఖ్య గతంతో పోలిస్తే రెండింతలు పెరిగిందని, శస్త్రచికిత్సలు కూడా మూడు నుంచి నాలుగు రెట్లు అధికమయ్యాయని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతున్నదానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, శిశువు మృతి దురదృష్టకర ఘటన అని, విచారణలో వైద్యుల నిర్లక్ష్యం తేలితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలలో లోపాలు, వైద్యులు లేదా సిబ్బంది నిర్లక్ష్యానికి సంబంధించిన ఫిర్యాదులను నేరుగా తన మొబైల్ నంబర్ 9849902961కు తెలియజేయవచ్చని డా. విష్ణువర్ధన్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. శ్యామల, డా. శశిధర్, డా. రామయ్యతో పాటు వివిధ విభాగాల వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.



