హైదరాబాద్ (కాచిగూడ): దేశ జనాభాలో దాదాపు 50 శాతం మంది 26–27 ఏళ్ల లోపు యువతే ఉన్నారని, వారికి నాణ్యమైన విద్యతో పాటు సరైన ఉపాధి మార్గదర్శకత్వం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి స్పష్టం చేశారు. యువత విద్యను విస్మరిస్తే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించారు. అందుకే రాష్ట్రంలో విద్యా వ్యవస్థను పటిష్టం చేస్తూ గ్రాడ్యుయేషన్ స్థాయిలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నామని తెలిపారు.

కాచిగూడలోని అవంతి కళాశాల గ్రాడ్యుయేషన్ డే వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. అవంతి విద్యా సంస్థల చైర్మన్, మాజీ మంత్రి ఎం. శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. అనంతరం విద్యార్థులకు డిగ్రీ పట్టాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… విస్తరిస్తున్న పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా మానవ వనరులను తీర్చిదిద్దడంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యా పూర్తి చేసుకున్న విద్యార్థులు నైపుణ్యాలను పెంపొందించుకుని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పిలుపునిచ్చారు.



