Vijayawada City News :వైద్యారోగ్య రంగంలో సాంకేతికతకు పెద్దపీట-అమరావతి క్వాంటం బయో వ్యాలీకి జాతీయ గుర్తింపు ఇవ్వాలి- చంద్రబాబు

Sharat
1 View

విజయవాడ, సెప్టెంబర్ 12:– వైద్యారోగ్య రంగంలో ఆధునిక సాంకేతికతను విస్తృతంగా వినియోగించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సంజీవని కార్యక్రమాన్ని అమలు చేస్తామని, ఇది వైద్యరంగంలో గేమ్‌చేంజర్‌గా నిలుస్తుందని పేర్కొన్నారు. జనవరి 1 నుంచి ప్రజల ఆరోగ్య రికార్డులను డిజిటలైజ్ చేయనున్నట్లు వెల్లడించారు.

విజయవాడలో శనివారం వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అభివృద్ధి కార్యక్రమాల్లో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో కలిసి చంద్రబాబు పాల్గొన్నారు. విజయవాడ పాత ప్రభుత్వాస్పత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన క్రిటికల్ కేర్ బ్లాక్, ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబరేటరీని వారు ప్రారంభించారు.

అనంతరం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కళావేదికలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా రూ.249 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన 10 క్రిటికల్ కేర్ బ్లాకులు, 12 ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబరేటరీలను వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ సదుపాయాల ద్వారా రాష్ట్రంలో అదనంగా 500 క్రిటికల్ కేర్ బెడ్లు అందుబాటులోకి వచ్చాయి. అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు, అల్ట్రాసౌండ్ సదుపాయాలతో పాటు కార్డియాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ వంటి కీలక వైద్య విభాగాల సేవలు అందుబాటులోకి వచ్చాయి.Vijayawada City News

అత్యవసర వైద్య పరిస్థితుల్లో పేద, మధ్యతరగతి కుటుంబాలకు మెరుగైన వైద్యం అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ సదుపాయాలను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. అత్యాధునిక చికిత్స కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరాన్ని తగ్గించేలా క్రిటికల్ కేర్ బ్లాకులు, ల్యాబరేటరీలను అందుబాటులోకి తెచ్చామని పేర్కొంది.

డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో అభివృద్ధి

కేంద్ర ప్రభుత్వం గత 12 ఏళ్లలో వైద్యరంగంలో అనేక మార్పులు తీసుకొచ్చిందని చంద్రబాబు తెలిపారు. దేశంలో మెడికల్ సీట్ల సంఖ్యను 51 వేల నుంచి రెండింతలకుపైగా పెంచినట్లు చెప్పారు. కోవిడ్ సమయంలో ప్రపంచానికి వ్యాక్సిన్ అందించడంలో భారత్ కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు.

మంగళగిరి ఎయిమ్స్ అభివృద్ధి, జన ఔషధి కేంద్రాల ద్వారా పేదలకు మందుల అందుబాటు, అభా కార్డుల ద్వారా వైద్య సేవలను మరింత సులభతరం చేయడం వంటి కార్యక్రమాలను ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ ఫార్మా రంగానికి ప్రధాన కేంద్రంగా ఎదుగుతోందని, మెడ్‌టెక్ పార్కు ద్వారా వైద్య పరికరాల ఉత్పత్తికి ప్రోత్సాహం అందిస్తున్నామని తెలిపారు.

ఆహారాన్నే ఔషధంగా భావించే విధంగా ప్రజలు తమ జీవన విధానాన్ని మార్చుకోవాలని సూచించారు. యోగా, ప్రాణాయామం, ధ్యానం వంటి వాటిని నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని చెప్పారు. సంప్రదాయ ఆరోగ్య పద్ధతులను కొనసాగిస్తూనే ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటే ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించవచ్చని తెలిపారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో కూడిన డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతోనే ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సాధ్యమవుతున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. వైద్యారోగ్య రంగంతో పాటు అన్ని రంగాల్లోనూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తున్నామని, పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు తరలించిన విషయాన్ని గుర్తుచేశారు.

కేంద్ర సహకారం, రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం, ప్రజల భాగస్వామ్యంతో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలుపుతామని చంద్రబాబు స్పష్టం చేశారు. ‘హెల్తీ–వెల్తీ–హ్యాపీ ఆంధ్రప్రదేశ్’ దిశగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలిపారు.

అమరావతికి సాంకేతిక కేంద్రంగా గుర్తింపు

అమరావతిని భవిష్యత్ సాంకేతికతకు కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని చంద్రబాబు తెలిపారు. అమరావతిలో ఏర్పాటు చేయనున్న క్వాంటం బయో వ్యాలీకి జాతీయ ప్రాజెక్టు హోదా కల్పించాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాను కోరారు.

దేశంలో తొలి క్వాంటం కంప్యూటర్ అమరావతిలోనే ప్రారంభం కానుందని తెలిపారు. ఏఐ రంగంలో నిపుణులను తయారు చేసేందుకు యువతకు శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. సాంకేతికతను అన్ని రంగాల్లో విస్తృతంగా వినియోగిస్తే రాబోయే పదేళ్లలో రాష్ట్రం గణనీయమైన ప్రగతి సాధిస్తుందని పేర్కొన్నారు.

చప్పట్లు, కేరింతలతో మార్మోగిన కళావేదిక

అంబేద్కర్ కళావేదికలో చంద్రబాబు వేదికపైకి వచ్చిన సమయంలో వైద్య విద్యార్థులు, సభికులు పెద్దఎత్తున హర్షధ్వానాలతో స్వాగతం పలికారు. ప్రసంగం సందర్భంగా పలు సందర్భాల్లో సభికులు చప్పట్లు, కేరింతలతో స్పందించారు.

ప్రధాని నరేంద్ర మోదీ, అమరావతి, సంజీవని కార్యక్రమం, సాగునీటి ప్రాజెక్టుల గురించి చంద్రబాబు ప్రస్తావించిన సందర్భాల్లో సభికుల నుంచి పెద్దఎత్తున హర్షధ్వానాలు వినిపించాయి. కార్యక్రమం ముగిసిన అనంతరం చంద్రబాబు, జేపీ నడ్డా వేదికపైనే సెల్ఫీ తీసుకున్నారు.

ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, ప్రజాప్రతినిధులు కేశినేని శివనాధ్, బోండా ఉమ, సోము వీర్రాజు, వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు

Author
Share This Article
Leave a review