అమరావతి, ఆగస్టు 23:- రైతుల పంటకు విలువ జోడించి, ప్రాసెసింగ్, బ్రాండింగ్ ద్వారా మార్కెట్‌కు అనుసంధానం చేసి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే దిశగా ఏలూరు జిల్లా ముసునూరు మరో కీలక కార్యక్రమానికి వేదిక కానుంది. సోమవారం ముసునూరు మండలం కాట్రేనిపాడులో దేశంలో తొలి నాన్-GMO పాప్‌కార్న్ మెయిజ్ హైబ్రిడ్ విత్తనాన్ని ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, సీఎం చంద్రబాబు సంయుక్తంగా ఆవిష్కరించనున్నారు.
గోర్మే పాప్‌కార్నికా సంస్థ ఆధ్వర్యంలో జన్యుపరంగా మార్పు చెందని ఈ కొత్త మొక్కజొన్న వంగడాన్ని ఆవిష్కరించనున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా వేల ఎకరాల్లో పాప్‌కార్న్ మెయిజ్ సాగు చేస్తున్న సంస్థ.. వేలాది మంది రైతులతో భాగస్వామ్యాన్ని కొనసాగిస్తోంది. ముసునూరులో నిర్మించిన పాప్‌కార్న్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఆసియాలోనే అతిపెద్ద కేంద్రాల్లో ఒకటిగా నిలుస్తోంది. దేశంలోని వేలాది సినిమా థియేటర్లకు పాప్‌కార్న్ సరఫరా చేయడంలో సంస్థ కీలకంగా వ్యవహరిస్తోంది.
రైతులు పండించిన పంటకు కేవలం మద్దతు ధరకే పరిమితం కాకుండా ప్రాసెసింగ్, బ్రాండింగ్, మార్కెటింగ్ ద్వారా అదనపు విలువను తీసుకురావడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కొత్త హైబ్రిడ్ విత్తనం అందుబాటులోకి రావడం ద్వారా పాప్‌కార్న్ మెయిజ్ సాగుకు మరింత ప్రోత్సాహం లభించే అవకాశం ఉంది.
సీఎం పర్యటన షెడ్యూల్
సీఎం చంద్రబాబు సోమవారం ఉదయం 9.55 గంటలకు క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరి 10.15 గంటలకు ముసునూరు మండలం కాట్రేనిపాడుకు చేరుకుంటారు. ఉదయం 10.45 గంటలకు గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో కలిసి ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌కు స్వాగతం పలుకుతారు. 11 గంటలకు నిర్వహించే హైబ్రిడ్ మొక్కజొన్న విత్తనం ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 1.20 గంటలకు రాష్ట్ర సచివాలయానికి చేరుకుంటారు.



