చిన్నగంజాం: జూలై 29 :- బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలోని చిన్నగంజాం మండలంలో గురు పౌర్ణమి సందర్భంగా బుధవారం వివిధ దేవాలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. రైల్వే స్టేషన్ సమీపంలోని శిరిడీ సాయి మందిరంలో తెల్లవారుజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి సాయిబాబాకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు.
గురు పౌర్ణమి పురస్కరించుకుని ఆలయంలో రోజంతా భక్తుల రద్దీ కొనసాగింది. అనంతరం శిరిడీ సాయి మందిరంతో పాటు మరో ఆలయం వద్ద కలిపి సుమారు నాలుగు వేల మంది భక్తులకు అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు.
మండలంలోని పలు దేవాలయాల్లో కూడా గురు పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించగా, ప్రత్యేక పూజలు, భజనలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ఆలయాలు భక్తులతో కిక్కిరిశాయి. గురు పౌర్ణమి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో ఆలయాలను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.



