బాపట్ల, జూన్ 19 -: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన “రెండేళ్ల నమ్మకం” కార్యక్రమంలో భాగంగా శుక్రవారం బాపట్ల తూర్పు సత్రంలో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక స్టాల్‌ను ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయుష్ శాఖ అందిస్తున్న సేవలు, గత రెండేళ్లలో సాధించిన పురోగతిని ప్రజలకు వివరించారు.
ఈ సందర్భంగా ఉప్పుటూరు ప్రభుత్వ హోమియో వైద్యులు, బాపట్ల జిల్లా యోగాంధ్ర నోడల్ అధికారి డాక్టర్ దాసరి చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రజారోగ్య పరిరక్షణకు ఆయుష్ సేవలను మరింత చేరువ చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 150 కొత్త ఆయుష్ వైద్యశాలలను ఏర్పాటు చేయడంతో పాటు అవసరమైన ఆయుష్ ఔషధాలను అన్ని కేంద్రాల్లో అందుబాటులో ఉంచినట్లు చెప్పారు.
ప్రజలు ఆరోగ్యవంతమైన జీవనం గడపాలంటే యోగా, సహజ చికిత్సలు, ముందస్తు ఆరోగ్య జాగ్రత్తలపై అవగాహన పెంపొందించడం అవసరమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించిన “యోగాంధ్ర” కార్యక్రమాన్ని ఆయుష్ శాఖ ఇతర శాఖల సమన్వయంతో విస్తృతంగా అమలు చేస్తోందని తెలిపారు. యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని, జిల్లాలో ప్రజల్లో ఆరోగ్య చైతన్యం పెంపొందించేందుకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ మార్గదర్శకత్వంలో ఆయుష్ శాఖ సేవలను గ్రామస్థాయికి చేరవేసేందుకు కృషి చేస్తున్నామని డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ, ఆరోగ్య కార్యక్రమాలను ప్రతి ఒక్కరికీ చేరవేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆయుష్ వైద్యులు డాక్టర్ భువనేశ్వరి, డాక్టర్ సిద్ధార్థ, డాక్టర్ ప్రదీప్ కుమార్, డాక్టర్ రోషన్, అంజమ్మతో పాటు ఆయుష్ వైద్య బృంద సభ్యులు పాల్గొన్నారు.



