జీలుగుమిల్లి :- అమరావతి ఛాంపియన్‌షిప్–2026లో భాగంగా జీలుగుమిల్లి మండలం బర్రింకాలపాడు ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ కాలేజీ వేదికగా నియోజకవర్గస్థాయి క్రీడా పోటీలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. పోలవరం నియోజకవర్గ శాసనసభ్యులు చిర్రి బాలరాజు, శాప్ (SAP) డైరెక్టర్ కొవ్వాసు జగదీశ్వరితో కలిసి రిబ్బన్ కట్ చేసి ఈ పోటీలను అధికారికంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ… విద్యార్థులు కేవలం చదువుకే పరిమితం కాకుండా క్రీడల్లోనూ విశేషంగా రాణించాలని ఆకాంక్షించారు. ఆటలు ఆడటం వల్ల విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తి, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలతో పాటు ఆత్మవిశ్వాసం పెరుగుతుందని అన్నారు. రాష్ట్రంలోని విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసే లక్ష్యంతోనే కూటమి ప్రభుత్వం ‘అమరావతి ఛాంపియన్‌షిప్’ వంటి బృహత్తర కార్యక్రమాలను నిర్వహిస్తోందని తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా కూటమి ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తు కోసం అన్ని రకాల వసతులు, సౌకర్యాలను కల్పిస్తోందని హామీ ఇచ్చారు.
ఈ నియోజకవర్గస్థాయి పోటీలకు పరిసర ప్రాంతాల నుంచి సుమారు 500 మందికి పైగా విద్యార్థిని విద్యార్థులు హాజరై తమ ప్రతిభను చాటుకునేందుకు ఉత్సాహంగా పాల్గొనడంతో ప్రాంగణమంతా కోలాహలంగా మారింది. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.



