పెనమలూరు:-ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియను జిల్లా కలెక్టర్ డీకే బాలాజి శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తాడిగడప మున్సిపాలిటీ పరిధిలోని పెనమలూరు ఎంపీడీవో కార్యాలయంలో ఆకస్మికంగా పర్యటించిన ఆయన.. ఈ కార్యక్రమం పురోగతిపై ప్రత్యేక అధికారులు మరియు ఎన్నికల విభాగం సిబ్బందితో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. బూత్‌ల వారీగా నమోదైన ‘నాట్ ట్రేస్డ్’, ‘నో మ్యాపింగ్’, ‘అన్ కలెక్టబుల్’, ‘డూప్లికేట్’ కేసులకు సంబంధించిన రికార్డులను పక్కాగా డాక్యుమెంటేషన్ చేయాలని స్పష్టం చేశారు. చెక్‌లిస్ట్ ఆధారంగా ప్రతి బూత్‌లోని వివరాలను బీఎల్‌వోలు (BLOs) క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా ధృవీకరించి, రికార్డులను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు. డాక్యుమెంటేషన్‌లో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా అన్ని అంశాలను పరిశీలించి ప్రక్రియను విజయవంతంగా ముగించాలని సూచించారు.
ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం నేటితో ముగుస్తున్న తరుణంలో.. డిజిటలైజేషన్ ప్రక్రియ ఏ స్థాయిలో ఉంది? ఇంకా ఏమైనా పెండింగ్ కేసులు ఉన్నాయా? అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎక్కడైనా సాంకేతిక లేదా ఇతర సమస్యలు తలెత్తితే తక్షణమే పరిష్కరించాలని, తదుపరి దశకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ముందస్తుగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ పర్యటనలో కలెక్టర్ వెంట ఉయ్యూరు ఆర్డీఓ ఎస్. కరుణ కుమారి, తాడిగడప మున్సిపల్ కమిషనర్ నజీర్, బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి జి. రమేష్, జిల్లా మైనారిటీల సంక్షేమ శాఖ అధికారి రబ్బాని, బీసీ కార్పొరేషన్ ఈడీ రాజేంద్రబాబు, అడల్ట్ ఎడ్యుకేషన్ అధికారి బేగ్ తదితర అధికారులు పాల్గొన్నారు.



