రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తోందని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) ఆధ్వర్యంలో, ఎమ్మెల్యే గళ్ళా మాధవి సహకారంతో జూన్ 2వ తేదీన గుంటూరులోని హిందూ ఫార్మసీ కళాశాల, అమరావతి రోడ్, నగరాలు, వేలంగిని నగర్‌లో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు గళ్ళా మాధవి వెల్లడించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ… యువతే రాష్ట్ర భవిష్యత్తు అని, వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ జాబ్ మేళాలో ఐటీ, నాన్-ఐటీ రంగాలకు చెందిన 30 ప్రముఖ కంపెనీలు పాల్గొంటుండగా, సుమారు 1,100 ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు వారి విద్యార్హతలు, నైపుణ్యాలను బట్టి నెలకు రూ.9,000 నుంచి రూ.35,000 వరకు వేతనాలు లభించే అవకాశం ఉందన్నారు. పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, ఫార్మసీ, పీజీ వరకు చదువుకున్న 18 నుంచి 25 సంవత్సరాల వయస్సు గల నిరుద్యోగ యువతీ యువకులు ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చని తెలిపారు. అభ్యర్థులు తమ బయోడేటా లేదా రెజ్యూమ్, విద్యార్హతల సర్టిఫికెట్ల జిరాక్స్ ప్రతులు, ఆధార్ కార్డు కాపీ, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలతో నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సూచించారు. జూన్ 2వ తేదీ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించే ఈ మెగా జాబ్ మేళాను జిల్లా యువత సద్వినియోగం చేసుకుని ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఎమ్మెల్యే గళ్ళా మాధవి పిలుపునిచ్చారు.



