
బాపట్ల, నవంబర్ 8:-ఆంధ్రప్రదేశ్‌లో సాంకేతిక విద్యలో విశిష్ట స్థానాన్ని సంపాదించిన బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో 12వ స్నాతకోత్సవ వేడుకలు శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన అతిథిగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (APSCHE) చైర్మన్ డా. కె. మధుమూర్తి హాజరయ్యారు.ఉదయం 11 గంటలకు ఆయన నెక్స్ట్ జెన్ టెక్నాలజీ & రీసెర్చ్ బ్లాక్ భవనంలో 250కి పైగా ఆధునిక కంప్యూటర్లతో ఏర్పాటైన ప్రయోగశాలను ప్రారంభించారు. అనంతరం కళాశాల ఆడిటోరియంలో జరిగిన స్నాతకోత్సవ కార్యక్రమంలో బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షుడు శ్రీ ముప్పలనేని శ్రీనివాసరావు, వైస్ ప్రెసిడెంట్లు శ్రీ కారుమంచి వెంకట్రావు, శ్రీ పారేపల్లి చంద్రశేఖర్, జాయింట్ సెక్రటరీ శ్రీ దొడ్డపనేని వెంకయ్య చౌదరి, ట్రెజరర్ శ్రీ కోటా వీరబ్రహ్మయ్య లతో కలిసి జ్యోతిప్రజ్వలన నిర్వహించారు.

కార్యక్రమంలో ప్రార్థనాగీతంతో ప్రారంభమై, కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎన్. రమాదేవి కళాశాల సాధించిన విజయాలను వివరించారు. ఈ సందర్భంగా యాజమాన్యం, అధ్యాపక బృందం, మరియు స్నాతకోత్సవం విజయవంతం చేసేందుకు కృషి చేసిన కోఆర్డినేటర్ డా. నజీర్ షేక్కు ఆమె ధన్యవాదాలు తెలిపారు.సొసైటీ అధ్యక్షుడు శ్రీ ముప్పలనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ, బాపట్ల ఇంజనీరింగ్ కళాశాల జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలతో విద్య అందిస్తోందని, విద్యా ప్రదాత కీర్తిశేషులు ముప్పలనేని శేషగిరిరావు సేవలను స్మరించుకున్నారు. విద్యార్థులు కర్తవ్యనిష్ఠతో ప్రగతిపథంలో సాగాలని సూచించారు.ముఖ్య అతిథి డా. కె. మధుమూర్తి మాట్లాడుతూ, బాపట్ల ఇంజనీరింగ్ కళాశాల రాష్ట్రంలోనే కాక దేశవ్యాప్తంగా ప్రతిభావంతులైన విద్యార్థులను తయారు చేస్తోందని ప్రశంసించారు. సాంకేతిక రంగంలో రాణించాలంటే సృజనాత్మకత, పరిశ్రమ, కొత్తది నేర్చుకోవాలనే తపన అవసరమని చెప్పారు. ప్రస్తుత కాలంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ వంటి రంగాల్లో విశేష అవకాశాలు ఉన్నాయని తెలిపారు.ఈ సందర్భంగా ప్రతిభావంతులైన విద్యార్థులకు పతకాలు ప్రదానం చేశారు.

- గోల్డ్ మెడల్: సి.ఎస్.ఇ విద్యార్థిని కుమారి సి.హెచ్. పుణ్యవతి
- సిల్వర్ మెడల్: ఇ.ఇ.ఇ విద్యార్థిని కె. లలితా సత్య శ్రీ మల్లిక
- బ్రోంజ్ మెడల్: మెకానికల్ విద్యార్థి శ్రీ ఎన్. రామ్ కుమార్
ఈ స్నాతకోత్సవంలో 650 మంది విద్యార్థులు తమ డిగ్రీ పట్టాలను స్వీకరించారు. సెక్రటరీ శ్రీ మానం నాగేశ్వరరావు విద్యార్థులను అభినందించారు.కార్యక్రమంలో బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్లు, సభ్యులు, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కార్యక్రమం చివర్లో జాతీయ గీతంతో స్నాతకోత్సవ వేడుకలు ముగిశాయి.







