
గుంటూరు:- పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో మంగళవారం 39వ డివిజన్ టీడీపీ నేతలతో ఎమ్మెల్యే గళ్ళా మాధవి ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ సన్నద్ధత, కమిటీ పునర్వ్యవస్థీకరణపై ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు.
డివిజన్ స్థాయి నుంచే కమిటీల్లో మార్పులు చేసి, కొత్త నాయకత్వానికి అవకాశం కల్పించడంతో పాటు పాత అనుభవాన్ని వినియోగించుకుంటూ పూర్తి స్థాయిలో షఫ్లింగ్ చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. కొత్త శక్తితో కమిటీలను బలోపేతం చేస్తూ, ప్రతి డివిజన్‌లో ముఖాముఖి సమావేశాలు నిర్వహిస్తూ కార్యకర్తలతో పరిచయ వేదికలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.

మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం మొత్తం క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, అందుకోసం కార్యకర్తలను సన్నద్ధం చేయడంతో పాటు ఆయా డివిజన్లలోని స్థానిక సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. “మన పనితోనే గుర్తింపు తెచ్చుకోవాలి” అనే నినాదంతో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నామని పేర్కొన్నారు.

పదవులు రాకపోవడం లేదా వ్యక్తిగత కారణాలతో కొందరు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారని, అలాంటి వారందరికీ నేరుగా అవకాశం కల్పించేందుకే ఈ ముఖాముఖి కార్యక్రమాన్ని రూపొందించామని ఎమ్మెల్యే వివరించారు. ఎమ్మెల్యేను నేరుగా కలిసి తమ సమస్యలు చెప్పుకునే వేదిక ఇదని, ఆర్థిక, సామాజిక, మానసిక సమస్యల పరిష్కారానికి తాను అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో క్లస్టర్ మహమ్మద్ రఫీ, గుంటుపల్లి గురువయ్య, సింగంశెట్టి వీరయ్య, అబ్దుల్ ఖాదర్ బుడే, రుస్తుం బాబు, రఫీతో పాటు టీడీపీ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, పార్టీ కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.Guntur Local News







