GUNTUR NEWS :గుంటూరు నగరపాలక సంస్థ రిజర్వాయర్ల నుండి అనధికారికంగా త్రాగునీటి తరలింపుని నిలిపివేయాలని..
గుంటూరు నగరపాలక సంస్థ రిజర్వాయర్ల నుండి అనధికారికంగా త్రాగునీటి తరలింపుని నిలిపివేయాలని, తమ రోజువారీ పర్యటనల్లో, ఆకస్మికంగా రిజర్వాయర్లను తనిఖీ చేస్తామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ గారు స్పష్టం చేశారు. బుధవారం కమిషనర్ గారు బిఆర్ స్టేడియం రిజర్వాయర్ ని ఆకస్మికంగా తనిఖీ చేసి, ట్యాంకర్ల ద్వారా నీటి తరలింపును పరిశీలించి, రిజిస్టర్ ప్రకారం ఆయా ట్యాంకర్లు నీటి సరఫరా చేసినట్లు నమోదు చేసిన ప్రగతి నగర్ కు నేరుగా వెళ్లి స్థానికులను అడిగి తెలుసుకొని, రిజిస్టర్ లో ట్యాంకర్ల ట్రిప్పుల నమోదు నిర్లక్ష్యంపై సంబందిత ఆప్కాస్ ఉద్యోగిని తక్షణం సదరు విధుల నుండి తొలగించి ఇతర విభాగంలో విధులు కేటాయించాలని ఎస్ఈ ని ఆదేశించారు.
ఈ సందర్భంగా కమిషనర్ గారు మాట్లాడుతూ ప్రస్తుత వేసవిని దృష్టిలో ఉంచుకొని త్రాగునీటి సరఫరాపై ఇంజినీరింగ్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రిజర్వాయర్ల నుండి ట్యాంకర్ల ద్వారా నీటి అనధికార విక్రయాలు చేస్తున్నారని, తమ దృష్టికి వచ్చిందన్నారు. ఆకస్మికంగా రిజర్వాయర్ల తనిఖీలు చేస్తామన్నారు. ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాల్సి వస్తే ట్యాంకర్ నంబర్, డ్రైవర్ వివరాలు, ట్రిప్పులు, సరఫరా చేసిన ప్రాంతం, ప్రజల సంతకాలు, ఫోన్ నంబర్లను పక్కాగా రిజిస్టర్ లో నమోదు చేయాలని స్పష్టం చేశారు. కీలకమైన త్రాగునీటి సరఫరాలో నిర్లక్ష్యంగా ఉంటే ఇంజినీరింగ్ అధికారులపై కూడా చర్యలు తప్పవని హెచ్చరించారు. బిఆర్ స్టేడియం రిజర్వాయర్ లో పైప్ లైన్ లీకు మరమత్తు చేపట్టి నీటి వృధాని అరికట్టాలన్నారు. సుద్దపల్లి డొంక రోడ్ ఆక్రమణలను తొలగించాలని పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. అనంతరం బాలాజీ నగర్, యానాది కాలని, రాజీవ్ గృహ కల్ప ప్రాంతాన్ని పరిశీలించి, బాలాజీ నగర్ లో ఖాళీ స్థల యజమానులకు నోటీసులు ఇవ్వాలని, రాజీవ్ గృహకల్ప, యానాదీ కాలనీల్లో నూతన డ్రైన్, రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభించాలని ఏఈని ఆదేశించారు. 3 వంతెనల వద్ద ఆర్డీపి మేరకు జరిగిన విస్తరణ ప్రభావిత భవనాల తొలగింపు పరిశీలించి, పెండింగ్ లో ఉన్న మిగిలినవి కూడా తొలగించాలని, రైల్వే ఇంజినీరింగ్ అధికారులతో సమన్వయం చేసుకొని, వారి వైపు నుండి చేపట్టాల్సిన పనులను పూర్తి చేయాలని డిఈఈని ఆదేశించారు.
పర్యటనలో కార్పొరేటర్ చిస్టి, డిఈఈ నాగభూషణం, ఎస్ఎస్ రాంబాబు, ఏఈలు, టిపిఎస్ లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.