కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలోని 8, 9వ వార్డుల్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం భాగంగా ఇంటింటి ప్రచారాన్ని ఎమ్మెల్యే రాము మంగళవారం నిర్వహించారు. టీడీపీ పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే రాము ప్రతి వీధి, ప్రతి గుడిసె వరకు తిరుగుతూ, కరపత్రాలను అందజేస్తూ కూటమి ప్రభుత్వం చేసిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు.
ఇంటింటి ప్రచారంలో ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ ప్రతి ఇంటికి సంక్షేమం చేరుకోవడం చంద్రబాబు గారి సంకల్పమని గుర్తు చేశారు. ఏడాది కాలంలో ప్రభుత్వం పలు పథకాల ద్వారా ప్రజల కోసం అనేక మార్గదర్శకాలు రూపొందించిందని వివరించారు. ముఖ్యంగా చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలు ప్రతి కుటుంబ భవిష్యత్తును తీర్చిదిద్దడమే కాకుండా గ్రామీణ అభివృద్ధిలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువస్తాయన్నారు.
ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడం, వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవడమే లక్ష్యంగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్బంగా ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ స్థానిక సమస్యలు, వాస్తవ పరిస్థితులను తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లా నాయకుడు యలవర్తి శ్రీనివాసరావు, పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఇంటింటి ప్రచారం సందర్భంగా ప్రజలు ఎమ్మెల్యేకు అభినందనలు తెలియజేశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరి సహకారం అవసరమని రాము చెప్పారు. పార్టీ పట్ల ప్రజల విశ్వాసం మరింత పెంచేలా తాము కృషి చేస్తామని అన్నారు.