ఒత్తిడిని పెంచే ఆహారాలు – కార్టిసాల్ హార్మోన్ ప్రభావం, తగ్గించేందుకు జాగ్రత్తలు
మన రోజువారీ జీవితంలో ఒత్తిడి (స్ట్రెస్) అనేది విడదీయలేని భాగంగా మారింది. అయితే, మనం తీసుకునే ఆహారం కూడా ఒత్తిడిని ప్రభావితం చేస్తుందని చాలా మందికి తెలియదు. ముఖ్యంగా, కార్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్ స్థాయిని కొన్ని ఆహారాలు పెంచుతాయి. ఉదయం ఎక్కువగా కాఫీ లేదా బ్లాక్ టీ తాగడం వల్ల కార్టిసాల్ స్థాయి పెరిగిపోతుంది. ఇది తాత్కాలికంగా శరీరానికి ఉత్సాహాన్ని ఇచ్చినా, ఎక్కువగా తీసుకుంటే ఒత్తిడిని మరింత పెంచే ప్రమాదం ఉంది. అలాగే, వేయించిన ఆహారాలు – ఫ్రెంచ్ ఫ్రైస్, ఫ్రైడ్ చికెన్ వంటి వాటిలో చెడు కొవ్వులు అధికంగా ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఇది శరీరంలో కార్టిసాల్ విడుదలను ప్రేరేపించి, ఒత్తిడిని ఎక్కువ చేస్తుంది.
మరొక ముఖ్యమైన అంశం ఆల్కహాల్. తరచుగా మద్యం సేవించడం కార్టిసాల్ స్థాయిని పెంచడమే కాకుండా, నిద్రలో అంతరాయం కలిగిస్తుంది. ఇది శరీరానికి పూర్తిగా విశ్రాంతి కలగకుండా చేసి, మానసిక ఒత్తిడిని పెంచేలా చేస్తుంది. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ – అంటే ప్యాక్ చేసిన స్నాక్స్, ఫాస్ట్ ఫుడ్ వంటి వాటిలో ప్రిజర్వేటివ్స్, అధిక ఉప్పు, చెడు కొవ్వులు ఉంటాయి. ఇవి శరీరంలో వాపును (ఇన్ఫ్లమేషన్) పెంచి, కార్టిసాల్ స్థాయిని మరింత పెంచుతాయి.
అధిక చక్కెర కలిగిన ఆహారం కూడా శరీరంలో రక్తచక్కెర స్థాయిని వేగంగా పెంచుతుంది. ఇది తాత్కాలికంగా ఎనర్జీ ఇచ్చినా, తర్వాత కార్టిసాల్ విడుదలను పెంచి ఒత్తిడిని ఎక్కువ చేస్తుంది. ముఖ్యంగా, రోజూ తీపి పదార్థాలు, పానీయాలు ఎక్కువగా తీసుకునేవారు దీన్ని గమనించాలి.
ఈ కారణాల వల్ల, ఒత్తిడిని నియంత్రించుకోవాలంటే ఈ రకాల ఆహారాలను తగ్గించడం చాలా అవసరం. ఆరోగ్యకరమైన ఆహారం, తక్కువ కాఫీ, తక్కువ ప్రాసెస్డ్ ఫుడ్, తక్కువ చక్కెర, తక్కువ ఆల్కహాల్ తీసుకోవడం ద్వారా కార్టిసాల్ స్థాయిని సమతుల్యంలో ఉంచుకోవచ్చు. అలాగే, తాజా కూరగాయలు, పండ్లు, పూర్తి ధాన్యాలు, ప్రోటీన్, మంచి కొవ్వులు ఉన్న ఆహారం తీసుకోవడం ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుం. సరైన ఆహారపు అలవాట్లు, వ్యాయామం, తగినంత నిద్ర, ధ్యానం వంటి ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించడం ద్వారా మనం ఒత్తిడిని సమర్థవంతంగా నియంత్రించుకోవచ్చు.