
గుంటూరు: – నగర అభివృద్ధిపై అంబటి రాంబాబు, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తదితర వైసీపీ నేతలు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి విమర్శించారు. గుంటూరు నగరంలో నిర్మాణంలో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ (ఆర్ఓబి) అంశంపై ప్రజల్లో అపోహలు సృష్టించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.
మంగళవారం గుంటూరు పశ్చిమ టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ, శంకర్ విలాస్ బ్రిడ్జి వద్ద ఇటీవల వైసీపీ నేతలు రాజకీయ లబ్ధి కోసం బురద జల్లే ప్రయత్నం చేశారని అన్నారు. ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో అభివృద్ధి ఏమి జరిగిందో ప్రజలు చూశారని, అందుకే ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమయ్యారని వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం ఒకటిన్నర సంవత్సరంలోనే అభివృద్ధిలో స్పష్టమైన మార్పు తీసుకొచ్చిందని తెలిపారు.
అంబటి రాంబాబు వ్యాఖ్యలను ఖండిస్తూ, గుంటూరు నగర ఎమ్మెల్యేలను డమ్మీలు అన్న విమర్శలకు వాస్తవాలే సమాధానమని చెప్పారు. “మా అభివృద్ధి మీ గుండెల్లో డైనమైట్లా, ప్రజల గుండెల్లో డైమండ్‌లా నిలిచింది” అని వ్యాఖ్యానించారు. మొదటిసారి ఎంపీ, ఎమ్మెల్యే, మేయర్‌గా 18 నెలల్లో చేసిన అభివృద్ధిని, వైసీపీ ఐదు సంవత్సరాల్లో చేసిన పనులతో పోల్చి చెప్పాలని సవాల్ చేశారు.
ఆర్ఓబి అంశంపై మాట్లాడుతూ, ఇది ఫ్లైఓవర్ కాదని, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అని స్పష్టం చేశారు. ఫ్లైఓవర్, ఆర్ఓబి మధ్య తేడా తెలియకుండా విమర్శలు చేయడం బాధాకరమని అన్నారు. 2047 స్వర్ణాంధ్ర లక్ష్యంపై హేళనగా మాట్లాడటం అవగాహన లోపమేనని వ్యాఖ్యానించారు.Guntur Local News
డ్రెయిన్లు, రోడ్ల విస్తరణ వంటి పనులు ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని చేపడుతున్నామని, ప్రతి నిర్ణయానికి ముందు అధికారులతో సమీక్షలు, ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతోందని తెలిపారు. కేంద్రమంత్రి, ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ ప్రతి వారం గుంటూరులో ఉండి అభివృద్ధి పనులపై సమీక్షలు నిర్వహిస్తున్నారని చెప్పారు. అభివృద్ధి సమయంలో కొంత అసౌకర్యం తప్పదని, పెద్ద ప్రయోజనం కోసం ప్రజలు సహకరించాలని ఎమ్మెల్యే గళ్ళా మాధవి కోరారు.







