Guntur News: ఎన్నికల సందర్భంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయాలి
CPM MEETING IN GUNTUR
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు అయిన సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయాలని సిపియం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సి.హెచ్.బాబురావు డిమాండ్ చేశారు. బ్రాడిపేటలోని సిపియం జిల్లా కార్యాలయంలో సిపియం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి.రామారావు అధ్యక్షతన జిల్లా విస్తృత సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సి.హెచ్.బాబురావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందన్నారు. అధికారంలోకి వచ్చి 8 నెలలు పూరైయినది. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే సందర్భంగా మొదటి సంతకం మెగా డి.ఎస్సీ మీద చేశారన్నారు. కాని ఇప్పటి వరకు ఎప్పుడు పరీక్షలు నిర్వహిస్తారో చెప్పడం లేదన్నారు. ఏదోఒక సాకు పేరుతో కాలయాపన చేస్తున్నారే తప్ప హామీని నిలబెట్టుకునే ప్రయత్నం చేయడం లేదన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలలో భాగంగా తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, మహిళలకు నెలకు 1500రూ॥లు, రైతులకి ప్రతిఏటా 20,000రూ॥లు, నిరుద్యోగభృతి 3000రూ॥లు ఇస్తామన్నారు. వీటిల్లో ఏ ఒక్కటి అమలు జరగడం లేదన్నారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ వీటిని అమలు చేయాలి అంటే ప్రజలపై భారాలు మోపాల్సి వస్తుందని చెప్పడం సరికాదన్నారు. కేంద్రంలో భాగస్వామ్యంగా ఉన్నప్పటికీ ఇటీవల బడ్జెట్‌లో రాష్ట్రానికి నిధులు రాబట్టడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. వెనుకబడిన జిల్లాలలకు నిధులు, రాజధాని నిర్మాణానికి రావాల్సిన గ్రాంటులు తీసుకురావడంలో వైఫల్యం చెందారన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు పి.ఆర్.సి ప్రకటిస్తామని చెప్పి అచరణలో ఇంత వరకు అమలు చేయలేదన్నారు. మా ప్రభుత్వం కరెంట్ ఛార్జీలు పెంచదని చెప్పి అధికారంలోకి వచ్చిన వెంటనే సర్దుబాటు ఛార్జీల పేరుతో ప్రజలపై భారాలు మోపుతున్నారన్నారు. సిపియం జిల్లా కార్యదర్శి వై.నేతాజీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇళ్ళులేని పేదలకు ఇళ్ళ స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చిందని, మంత్రి నారాలోకేష్ మంగళగిరి ప్రాంతంలో ఇళ్ళ పట్టాలు ఇస్తామని శిలాఫలకం కూడా వేశారన్నారు. కాని అధికారంలోకి వచ్చాక పూర్తిగా విస్మరించారన్నారు. జిల్లా వ్యాపితంగా అనేక మంది ప్రభుత్వ భూముల్లో ఇళ్ళు వేసుకుని నివాసముంటున్నారని, వారికి వెంటనే ఇళ్ళ పట్టాలు ఇవ్వాలన్నారు. రాజధానికి భూములిచ్చిన అస్తైన్డ్ రైతులకు కూడా మిగతా రైతులకు ఇచ్చినట్లే నష్టపరిహారం ఇవ్వాలన్నారు. స్కీమ్ వర్కర్స్ ఆందోళనల ఫలితంగా ఇచ్చిన హామీలను ఇంత వరకు అమలు చేయడం లేదన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎన్.భావన్నారాయణ, ఇ.అప్పారావు, ఎమ్.రవి, కె.నళినీకాంత్, బూరగ వెంకటేశ్వర్లు, జిల్లా నాయకులు డి.శ్రీనివాసకుమారి, జవహర్‌లాల్, దుర్గారావు, డి.లక్ష్మీనారాయణ, బి.లక్ష్మణరావు, కె.అజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.