
నందిగామ, నవంబర్ 5:-మెంథా తుఫాన్ కారణంగా కురిసిన భారీ వర్షాల వల్ల నందిగామ మున్సిపాలిటీలోని 18వ వార్డు క్వారీ గుంట ప్రాంతంలో పేద కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. సుమారు 15 కుటుంబాల ఇళ్లలో వరద నీరు, మురుగు నీరు ఇంకా నిల్వ ఉండటంతో జీవనాధారం కష్టంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలో సిపిఎం నందిగామ కార్యదర్శి కటారపు గోపాల్ నేతృత్వంలో పార్టీ నాయకులు బుధవారం ఉమాకాలనీ ఫేజ్‌లోని బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా గోపాల్ మాట్లాడుతూ, “గత నెల 27, 28 తేదీల్లో కురిసిన వర్షాల తర్వాత ఇప్పటివరకు నీరు తొలగించలేదు. ప్రజలు, చిన్నపిల్లలు మురుగు నీటిలోనే జీవనం సాగిస్తున్నారు. పాములు, జెర్రిపోతులు సంచరిస్తుండటంతో ప్రజల ప్రాణాలకు ప్రమాదం ఏర్పడింది,” అని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రజలు రాత్రివేళ దోమల విపత్తుతో, దుర్వాసనతో బాధపడుతున్నారని, పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని తెలిపారు. “రోడ్లు కూడా కనపడని స్థాయిలో నీళ్లు నిలిచిపోయాయి. అధికారులు రేపే నీరు తోడేస్తామంటూ మాటలు ఇచ్చి మాయమయ్యారు. ఇప్పటివరకు ఎవరూ పట్టించుకోవడం లేదు,” అని బాధితులు మండిపడ్డారు.సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుని, నిల్వ నీరు తొలగించే మార్గం ఏర్పాటుచేయాలని సిపిఎం నాయకులు మున్సిపల్ అధికారులను డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు గోపి నాయిక్, బత్తుల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.







