అమరావతి: 17 సెప్టెంబర్ 2025: మహిళలను పారిశ్రామికంగా ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని, ఇదే క్రమంలో సెర్ప్ ద్వారా మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తయారుచేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంద్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. సెర్ప్, అలీప్ మధ్య జరిగిన బిజినెస్ డెవలప్‌మెంట్ సర్వీస్ ప్రొవైడర్స్ ఎంవోయూ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ మహిళా పారిశ్రామిక వేత్తల మండలి, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి కార్పొరేషన్ సంయుక్తంగా ర్యాంప్ కార్యక్రమం ద్వారా శిక్షణ పొందిన కృష్ణా జిల్లాలోని 35 బిజినెస్ డెవలప్‌మెంట్ సర్వీస్ ప్రొవైడర్స్ (BDSPs)లకు సర్టిఫికెట్లను మంత్రి చేతుల మీదుగా ప్రధానం చేశారు. ప్రపంచబ్యాంకు, కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్దతుతో ఎ పి యం ఎస్ యం ఈ డి సి ర్యాంప్ ప్రోగ్రామ్ ద్వారా ఈ శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ వెనుకబడిన ప్రాంతాల మహిళలను, మహిళా పారిశ్రామిక వేత్తలుగా ప్రోత్సహించాలనే లక్ష్యంతో ప్రారంభించిన ఎలీప్ 30 ఏళ్ళకు పైగా తన సేవలను కొనసాగించడం ఓ చరిత్ర అని అన్నారు. మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించే గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులు, ఫ్యాబ్ సెల్ సెంటర్లను ఈ 30 ఏళ్ళలో అలీప్ నెలకొల్పిందని చెప్పారు. ప్రతి ఇంటి నుండి ఓ పారిశ్రామిక వేత్తను తయారు చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా అలీప్ సంస్థ పని చేస్తోందని తెలిపారు. మహిళలు కేవలం వంటింట్లోనే కాదు, పారిశ్రామిక రంగంలో మహారాణులు కాగలరని ఎలీప్ నిరూపించిందని అన్నారు. ఎలీప్ ద్వారా గార్మెంట్స్ తయారీ, ప్యాకేజింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, బయోటెక్నాలజీ, ప్లాస్టిక్స్, ఫార్మాస్యూటికల్స్ మొదలైన రంగాల్లో మహిళలను ప్రోత్సహిస్తున్న విధానం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. మహిళలకు శిక్షణ అందించడమే కాకుండా వారికి స్వయం ఉపాధి కల్పిస్తూ, ఓ కుటుంబానికే కాదు మహిళలు రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థకు వెన్నెముక అని చాటి చెప్పడంలో అలీప్ విజయవంతం అయిందని తెలియజేశారు. 32 ఏళ్ళ క్రితం ముందు చూపుతో సూరంపల్లిలో ఏర్పాటు చేసిన ఈ ఇండస్ట్రియల్ పార్క్ లో నేడు 3 వేల మందికి పైగా మహిళలు స్వయం ఉపాధి పొందుతున్నారని, అలీప్ ద్వారా హైదరాబాద్ లోను అనేక మంది ఉపాధి పొందుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపిస్తున్న అలీప్ వ్యవస్థాపకురాలు కన్నెగంటి రమాదేవిని మనస్పూర్తిగా అభినందిస్తున్నానని మంత్రి శ్రీనివాస్ తెలియజేశారు..పారిశ్రామికాభివృద్ధికి ఇప్పుడున్న అడ్డంకులను తొలగిస్తూ ప్రభుత్వం ముందుకు వెళ్తోందని,చిన్న పరిశ్రమలను ప్రోత్సహించే దిశగా తమ ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. మార్కెట్ డిమాండ్ కు తగ్గట్టుగా సూరంపల్లిలో చిన్న చిన్న పరిశ్రమలను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని, ఇలాంటి పరిశ్రమలు మరిన్ని రావాలని మంత్రి ఆకాంక్షించారు. డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసినప్పుడు ఎందుకు నవ్విన వాళ్ళు కూడా డ్వాక్రా సంఘాలను కొనసాగించడమే చంద్రబాబు నాయుడు గారు సాధించిన విజయని అన్నారు. స్వయం ఉపాధి అనేది మహిళలకు మాత్రమే కాదని, కుటుంబాల అభ్యున్నతికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. మన దేశంలో మానవ వనరులు ఎక్కువగా ఉన్నాయని, పని చేసే సామర్ధ్యం ఉన్న వారు 71 శాతం మంది ఉన్నారని చెప్పారు. ఈ శక్తి వృధా కాకుండా వారందరు పారిశ్రామిక వేత్తలుగా మారాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలియజేశారు. చిన్న చిన్న పరిశ్రమలతో దేశ, రాష్ట్ర జీడీపీ ఎంతగానో పెరుగుతుందని, తలసరి ఆదాయంలో తెలుగు వాళ్ళు ప్రపంచంతో పోటీ పడుతున్నారని చెప్పారు. ఎన్నో వస్తువులను మనం దిగుమతి చేసుకుంటున్నామని, వాటిని తయారు చేసి మనం ఎగుమతి చేయగలిగితే ఎంతో ప్రయోజనం ఉంటుందని మంత్రి శ్రీనివాస్ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సెర్ప్ సి ఇ ఓ వాకాటి కరుణ, కృష్ణ జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ వెంకటరావు, ఎలీప్ అధ్యక్షురాలు కన్నెగంటి రమాదేవి, యం ఎస్ ఎం ఈ కార్పొరేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
201 2 minutes read