గుంటూరు, అక్టోబర్ 7: గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో మంగళవారం భద్రతా అవగాహన మరియు సమీక్షా సమావేశం జరిగింది. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఐపీఎస్ అధ్యక్షతన తుళ్లూరు మరియు నార్త్ సబ్ డివిజన్ల పోలీస్ అధికారులతో ఈ సమీక్ష నిర్వహించబడింది.
ఈ సందర్భంగా ఎస్పీ జిందాల్ కీలక భద్రతా అంశాలపై అధికారులను ఆరా తీశారు. ముఖ్యంగా వీవీఐపీ మరియు వీఐపీలు అధికంగా నివసించే ఈ ప్రాంతాల్లో భద్రతను మరింత బలోపేతం చేయాలని, కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
మాదక ద్రవ్యాల నియంత్రణపై కఠిన చర్యలు
గంజాయి మరియు ఇతర మాదక ద్రవ్యాల చట్టవిరుద్ధ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించిన ఎస్పీ, పాత నేరస్థుల కదలికలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని పేర్కొన్నారు. వారి మీద చట్టవ్యతిరేక కార్యకలాపాలపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
విద్యార్థులకు పూర్తి భద్రత
ఈ రెండు సబ్ డివిజన్ల పరిధిలో ప్రఖ్యాత విద్యాసంస్థలు అధికంగా ఉండటంతో విద్యార్థినీ, విద్యార్థులకు పూర్తి భద్రత కల్పించేందుకు పగలు, రాత్రి గస్తీని పటిష్టం చేయాలని సూచించారు.
ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, సీసీటీవీ, డ్రోన్ పర్యవేక్షణపై దృష్టి
సచివాలయం, హైకోర్టు పరిసర ప్రాంతాల్లో జడ్జిలు, వీఐపీలు రాకపోకల సమయంలో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు. అంతే కాకుండా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో సీసీటీవీ కెమెరాలు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలని, డ్రోన్ బీట్ నిర్వహిస్తూ ఓపెన్ డ్రింకింగ్, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టాలని సూచించారు.
ఈ సమావేశంలో నార్త్ డీఎస్పీ మురళీకృష్ణ, డివిజన్ పరిధిలోని సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.