అమరావతి, అక్టోబర్ 09:రాష్ట్రంలోని బ్లూకాలర్ ఉద్యోగార్థుల భవిష్యత్‌కు వెలుగునిచ్చే విధంగా ఓంక్యాప్ (OMCAP) ద్వారా వచ్చే ఐదేళ్లలో లక్ష ఉద్యోగాలు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఉండవల్లి నివాసంలో గురువారం స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నర్సింగ్, వెల్డింగ్, ట్రక్కింగ్, బిల్డింగ్ వర్క్స్ వంటి రంగాల్లో యూరప్, జర్మనీ, ఇటలీ వంటి దేశాల్లో విస్తృతంగా డిమాండ్ ఉన్నదని చెప్పారు. ఇటువంటి అవకాశాలను మన యువత ఉపయోగించుకునేలా విదేశీ భాషల్లో శిక్షణ, సర్టిఫికేషన్, ప్లేస్‌మెంట్‌కు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 2,774 మంది నర్సింగ్ అభ్యర్థులు విదేశీ భాషల్లో శిక్షణ పొందుతున్నట్లు అధికారులు వివరించారు. జర్మన్ లాంగ్వేజ్ శిక్షణ కోసం DEFA, TELC లాంటి సంస్థలతో ఎంఓయూలు కుదుర్చుకున్నట్లు వెల్లడించారు.
ఐటీఐల అభివృద్ధికి మిషన్ మోడ్ లో చర్యలు
రాష్ట్రంలోని 83 ప్రభుత్వ ఐటీఐలను మిషన్ మోడ్ లో అభివృద్ధి చేయాలని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. మౌలిక సదుపాయాలు, ఆధునీకరణ కోసం ఇప్పటికే రూ. 322 కోట్ల ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని తెలిపారు. ఐటీఐల్లో అడ్మిషన్లు పెరిగినా, సిబ్బంది కొరత ఉందని అధికారులు వివరించారు.
పీఎం వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన, పీఎం ఇంటర్న్‌షిప్ లాంటి కేంద్ర పథకాలలో ఆంధ్రప్రదేశ్‌ను నెంబర్ వన్‌గా నిలిపేందుకు సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని మంత్రి సూచించారు. కరిక్యులమ్, టెస్టింగ్, ఇంటర్న్‌షిప్, సర్టిఫికేషన్, ప్లేస్‌మెంట్ రంగాల్లో మెరుగుదల కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్పారు.
పాలిటెక్నిక్ కాలేజీలలో ఖాళీలు, అభివృద్ధిపై దృష్టి
రాష్ట్రంలోని 87 పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రస్తుతం 646 టీచింగ్, 2,183 నాన్ టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని మంత్రి దృష్టికి అధికారులు తీసుకువచ్చారు. విద్యార్థులకు మెరుగైన శిక్షణ అందించే ఉద్దేశ్యంతో దేశంలోని విజయవంతమైన మోడళ్లను అధ్యయనం చేయాలని ఆయన సూచించారు.
హబ్ అండ్ స్పోక్ మోడల్ కింద విశాఖపట్నం, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో మూడు హబ్‌లుగా, వాటికి అనుబంధంగా 13 స్పోక్స్‌లుగా ఐటీఐలను అభివృద్ధి చేయాలని స్పష్టం చేశారు.
నైపుణ్య శిక్షణకు ప్రైవేట్ భాగస్వామ్యం
ప్రత్యేకంగా ఆర్సెలర్ మిట్టల్ – నిప్పాన్ స్టీల్స్ అనుబంధ సంస్థ “నామ్‌టెక్” రాష్ట్రంలో నైపుణ్య శిక్షణా కేంద్రం ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిందని మంత్రి తెలిపారు. నైపుణ్యం పోర్టల్‌లో ఇప్పటికే 23 విభాగాల డేటాబేస్ ఏకీకృతమైందని, వచ్చే నెలలో యువతకు ఉద్యోగ సమాచారం అందుబాటులోకి రానుందని చెప్పారు.
ఈ సమీక్ష సమావేశంలో రాష్ట్ర మానవ వనరుల శాఖ కార్యదర్శి కోన శశిధర్, స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సీఈఓ గణేష్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.