
కుత్బుల్లాపూర్, ఫిబ్రవరి 11:- ప్రగతినగర్ చెరువు పరిరక్షణకు హైడ్రా అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. చెరువులో చెత్త, జంతు వ్యర్థాలు వేయడం వల్ల నెలకొన్న దుర్వాసన సమస్యపై స్థానికుల ఫిర్యాదుల నేపథ్యంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు విస్తృత శుభ్రత కార్యక్రమం నిర్వహించారు.

ఇటీవల చెరువులో పేరుకుపోయిన పూడికను తొలగించిన హైడ్రా అధికారులు, ఇప్పుడు చెత్త డంపింగ్‌ను పూర్తిగా అరికట్టేందుకు రోడ్డు పొడవునా భారీ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. చెరువు మధ్యలో ఉన్న రహదారి మార్గం వెంబడి చికెన్, మాంసం, చేపల విక్రేతలతో పాటు సమీప దుకాణదారులు వ్యర్థాలను చెరువులో పడేస్తున్నారని గుర్తించారు.
దీంతో 145 లారీల వరకు పేరుకుపోయిన జంతు వ్యర్థాలు, చెత్తను అధికారులు తొలగించారు. వ్యర్థాలు వేస్తున్న దుకాణదారులకు ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించి అక్కడికి మార్పించారు. ఇకపై చెరువులో చెత్త వేయడానికి అవకాశం లేకుండా దాదాపు కిలోమీటరు అర మేర 10 మీటర్ల ఎత్తులో ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు.Hyderabad- Amaravathi
అదేవిధంగా చెరువులోకి మురుగు నీరు కలవకుండా ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు హైడ్రా అధికారులు తెలిపారు. త్వరలోనే చెరువు అభివృద్ధి పనులను ప్రారంభించి ప్రగతినగర్ చెరువును సుందరీకరించనున్నట్లు వెల్లడించారు.
స్థానికులు హైడ్రా చర్యలను స్వాగతిస్తూ, చెరువు పరిరక్షణలో ప్రజల సహకారం కూడా అవసరమని పేర్కొన్నారు.










