
విశాఖపట్నం:14-11-25:-భారతదేశంలో టైర్–2 నగరాలు కొత్త గ్రోత్ ఇంజన్లుగా ఎదుగుతున్నాయని, ఈ మార్పులో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తోందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. “IT and GCCs in Tier-2 Cities in India: Breaking Barriers or Building Illusions?” అంశంపై సీఐఐ ఆధ్వర్యంలో విశాఖలో జరిగిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రైమస్ పార్ట్నర్స్ లిమిటెడ్ సీఈఓ నిలయ వర్మ నిర్వహించారు.ఏపీని పెట్టుబడులకు అనుకూల రాష్ట్రంగా మార్చడానికి ప్రభుత్వం ప్రధానంగా మూడు అంశాలను బలపరుస్తోందని మంత్రి తెలిపారు. ప్రతిభ, తక్కువ నిర్వహణ ఖర్చులు, నైపుణ్యాభివృద్ధికి ఆధునిక మెకానిజం ఇవే ఏపీలో ఐటి పెట్టుబడులను ఆకర్షిస్తున్న ప్రధాన కారణాలన్నారు.
రేపు ప్రారంభం కానున్న నైపుణ్యం పోర్టల్ దేశంలోనే తొలిసారి అమలు చేస్తున్న వినూత్న ప్రాజెక్ట్ అని వెల్లడించిన లోకేష్, కార్పెంటర్ నుండి ఏఐ ఇంజనీర్ వరకు అందరి నైపుణ్యాలను అంచనా వేసి, సరైన శిక్షణను అందించే విధంగా స్కిల్ సెన్సెస్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.“ఇది చరిత్ర సృష్టించే సమయం. పెట్టుబడిదారులు ఎంత వేగంగా ముందుకు వెళ్లాలనుకుంటే, ప్రభుత్వం అంతకంటే వేగంగా సహకరించడానికి సిద్ధంగా ఉంది” అని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.విశాఖపట్నం ప్రస్తుతం సముద్రతీర పారిశ్రామిక నగరాన్ని మించి, భారత డిజిటల్ డెస్టినేషన్ గా ఎదిగి, ఫైనాన్షియల్ సర్వీసులు, హెల్త్ అనలిటిక్స్, ఇంజనీరింగ్ డిజైన్, AI ఆధారిత ఉత్పత్తి అభివృద్ధి వంటి రంగాల్లో అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలకు కేంద్రంగా మారిందని ఆయన పేర్కొన్నారు.మెట్రో నగరాలతో పోలిస్తే 20 శాతం తక్కువ నిర్వహణ ఖర్చులు, 25 వేలకుపైగా ఐటి నిపుణుల లభ్యతతో విశాఖ ప్రపంచంలో విశ్వసనీయమైన టైర్–2 నగరంగా నిలుస్తోందన్నారు.







